అక్కినేని హీరోలు బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పైన చెప్పుకున్న సినిమాలన్నీ 30 శాతం లోపలే రికవరీ చేయగలిగాయి. ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద సింగిల్ డిజిట్ షేర్ సాధించలేకపోయింది.
అక్కినేని హీరోలు గత కొంతకాలంగా ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నారు. మిగతా హీరోలంతా వందల కోట్ల వసూళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే.. నాగచైతన్య, అఖిల్ మాత్రం సాలిడ్ హిట్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. మధ్య మధ్యలో కింగ్ నాగార్జున హిట్లు కొడుతున్నప్పటికీ, అవి ఆయన రేంజ్ కు తగ్గ హిట్లు కాదు. అందుకే అక్కినేని హీరోలు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
2022 దగ్గర నుంచి అక్కినేని హీరోల సినిమాలను పరిశీలిస్తే.. 'బంగార్రాజు'తో సక్సెస్ సాధించిన నాగ్, ఆ తర్వాత వెంటనే 'ది ఘోస్ట్' మూవీతో డిజాస్టర్ అందుకున్నారు. అదే ఏడాది 'థ్యాంక్యూ' రూపంలో నాగచైతన్యకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మరుసటి ఏడాది 'ఏజెంట్' సినిమాతో అఖిల్ భారీ డిజాస్టర్ చవి చూశారు. ఇదే క్రమంలో 'కస్టడీ' వంటి బైలింగ్వల్ మూవీతో వచ్చిన చైతూ.. తన ఖాతాలో మరో పెద్ద ఫ్లాప్ ను వేసుకున్నారు.
పైన చెప్పుకున్న సినిమాలన్నీ 30 శాతం లోపలే రికవరీ చేయగలిగాయి. ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద సింగిల్ డిజిట్ షేర్ సాధించలేకపోయింది. గతేడాది సంక్రాంతికి 'నా సామిరంగ' సినిమాతో నాగార్జున బ్రేక్ ఈవెన్ అందుకున్నారు కానీ, ఇది ఆయన స్థాయి సక్సెస్ కాదు. అందుకే అక్కినేని హీరోలు అర్జంట్ గా సాలిడ్ హిట్టు కొట్టి ట్రాక్ లోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తమ అభిమాన హీరోలు 2025లో మళ్లీ ఫామ్ లోకి వస్తారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న 'తండేల్' సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తోంది. ఫిబ్రవరి 7న తెలుగు తమిళ హిందీ విడుదల భాషల్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకి బజ్ క్రియేట్ చేసింది. ఈసారి యువసామ్రాట్ పక్కా బ్లాక్ బస్టర్ హిట్టు కొడతాడనే నమ్మకాన్ని అందరిలో కలిగించింది. దీని తర్వాత కార్తీక్ దండు డైరెక్షన్ లో చైతన్య ఓ భారీ మిథికల్ థ్రిల్లర్ లో నటించనున్నారు.
మరోవైపు 'లెనిన్' అనే సినిమా చేస్తున్నారు అఖిల్. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నాగార్జున సైతం ఈ ఇయర్ లో రెండు సినిమాలతో పలకరించబోతున్నారు. కాకపోతే వీటిల్లో ఆయన మెయిన్ హీరో కాదు.. కీలక పాత్రల్లో కనిపిస్తారు. సోలోగా నాగ్ ఇంకా ఏ సినిమానీ ప్రకటించలేదు.