OTT లే కొంపలు ముంచుతున్నాయన్న సూపర్‌స్టార్
కొన్ని వరుస డిజాస్టర్ల తర్వాత అక్షయ్ కుమార్ నటించిన `స్కై ఫోర్స్` ఈ నెలలో విడుదలకు సిద్ధమైంది.
కొన్ని వరుస డిజాస్టర్ల తర్వాత అక్షయ్ కుమార్ నటించిన `స్కై ఫోర్స్` ఈ నెలలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో అక్కీ ఇటీవల సినిమాల బాక్సాఫీస్ వైఫల్యం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. పింక్ విల్లాతో ఇంటర్వ్యూలో అక్కీ మాట్లాడుతూ... మహమ్మారీ బాక్సాఫీస్ సన్నివేశాన్ని పూర్తిగా మార్చేసిందని, ప్రజలు ఓటీటీల్లో సినిమాలు చూడటాన్ని అలవాటు పడ్డారని అన్నారు. ఓటీటీలు పుంజుకోవడంతోనే జనం థియేటర్లకు రావడం లేదని, ఇది బాక్సాఫీస్ వైఫల్యానికి దారి తీస్తోందని, మహమ్మారీ తర్వాత ప్రజల ఎంపికలు మారిపోయాయని విశ్లేషించారు.
నేను చాలా మందిని కలుస్తాను. వారంతా OTTలోనే సినిమాలు చూస్తామని చెబుతారు. కాబట్టి అదే అతిపెద్ద కారణం... అని అక్కీ అన్నారు. మహమ్మారి వీక్షణ అలవాట్లను తీవ్రంగా ప్రభావితం చేసిందని, ప్రేక్షకులు తమ సౌలభ్యం మేరకు ఇంట్లోనే సినిమాలు, షోలను చూడటానికి అలవాటు పడ్డారని వ్యాఖ్యానించారు. ప్రజలు OTT ప్లాట్‌ఫారమ్‌లలోకి వెళ్లి ఏం దొరుకుతుందో వెతకడం అలవాటు చేసుకున్నారని అక్షయ్ వివరించారు. మారుతున్న పరిస్థితులపై సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు కానీ, మారుతున్న ప్రేక్షకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా దర్శకనిర్మాతలు మారాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. ఇటీవల ప్రేక్షకులు ఎంపిక చేసుకున్న సినిమాల కోసం మాత్రమే థియేటర్లకు వెళుతున్నారు. వారికి ఏం కావాలో తెలుసుకుని దానిని అందించాలని, వందశాతం వినోదం వారికి ఇవ్వాలని అక్షయ్ విశ్లేషించారు.
ఖేల్ ఖేల్ మెయిన్, సర్ఫిరా, బడే మియాన్ చోటే మియాన్ వంటి భారీ చిత్రాలు గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. అక్షయ్ కుమార్ చాలా నిరాశను ఎదుర్కొన్నారు. 2023లోను సెల్ఫీ, మిషన్ రాణిగంజ్ ఫ్లాపులుగానే నిలిచాయి. OMG 2 తో అక్షయ్ మంచి విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం రిలీజ్ కి వస్తున్న యాక్షన్ డ్రామా `స్కై ఫోర్స్`పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. జాలీ LLB 3, భూత్ బంగ్లా, హౌస్‌ఫుల్ 5 లాంటి క్రేజ్ ఉన్న చిత్రాల్లో నటిస్తున్నాడు. 2025-26 సీజన్ అతడికి ఫేవర్ చేస్తుందని నమ్ముతున్నాడు.