అల్లు అర్జున్.. అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్లేనా?

ఇటీవల కాలంలో ఇరు వర్గాల మధ్య కొట్లాటలు మరీ ఎక్కువైపోయాయి.

Update: 2024-11-16 16:50 GMT

ఐకాన్ స్టార్ ఆర్మీ, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో నిత్యం గొడవలు జరగడం మనం చూస్తున్నాం. ఓ వర్గం అల్లు అర్జున్ ను విమర్శిస్తూ పోస్టులు పెడుతూ, మరో వర్గం దానికి కౌంటర్ గా మెగా హీరోలపై ట్రోల్స్ వేస్తూ ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఇరు వర్గాల మధ్య కొట్లాటలు మరీ ఎక్కువైపోయాయి. ఏపీలో ఎన్నికల తరువాత రచ్చ పీక్ స్టేజ్ కు చేరింది. సినిమాల విషయంలోనే కాకుండా, పర్సనల్ మ్యాటర్స్ ను కూడా లాగుతూ ఒకరికొకరు విమర్శించుకుంటూ వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కుటుంబ సభ్యులంతా ప్రార్థనలు చేస్తుంటే, మెగా కాంపౌండ్ కే చెందిన అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా కిషోర్ రెడ్డిని కలవడం వివాదాస్పదమైంది. బన్నీ తన ఫ్రెండ్ కోసం ప్రచారం ఏమీ చెయ్యలేదు. ఆ నియోజకవర్గంలో జనసేన క్యాండిడేట్ కూడా నిలబడలేదు. అయినా సరే అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళడం జన సైనికులను, మెగా అభిమానులను నొప్పించింది. పవన్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నాడనే విధంగా వెళ్ళిపోయింది.

అల్లు అర్జున్ పర్యటన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు లాంటి వాళ్లు పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా ఆయన్ను విమర్శించారు. సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు అన్ ఫాలో చేశారు. అక్కడ నుంచి అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య వార్స్ ఎలా కొనసాగాయో మనం చూశాం. ఇది బన్నీ నటిస్తున్న 'పుష్ప 2: ది రూల్' చిత్రాన్ని బాయ్ కాట్ చేస్తాం అనే వరకూ వెళ్లింది. ఇంత జరుగుతున్నా ఏదైనా ఒక మంచి సందర్భం వస్తే చాలు, రెండు ఫ్యామిలీలు ఇట్టే ఒకటైపోతాయని శ్రేయోభిలాషులు ఆశగా ఎదురు చూస్తూ వస్తున్నారు.

మెగా - అల్లు మధ్య సంబంధాల గురించి రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్న సమయంలో.. అల్లు అర్జున్ మళ్ళీ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. 'అన్ స్టాపబుల్' టాక్ షో వేదికగా పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడారు. "కళ్యాణ్ గారి ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. సొసైటీలో లీడర్స్, బిజినెస్ పీపుల్స్ చాలామందిని ఫాలో అవుతుంటాను. కానీ నేను దగ్గర నుంచి చూసిన వెరీ డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు'' అని బన్నీ అన్నారు. తన దారిలో తాను వెళ్ళిపోతుంటాడని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ పాజిటివ్ గా మాట్లాడటంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా నెగెటివిటీ అంతా పోయి, పాజిటివిటీ వచ్చి చేరింది. మెగా ఫ్యాన్స్ అంతా ఒకటేనని, ఫ్యాన్ వార్స్ ఆపాలంటూ పోస్టులు దర్శనమిచ్చాయి. మరోవైపు ఇతర హీరోల అభిమానులకు, అల్లు ఆర్మీకి మధ్య కూడా నెట్టింట ఏదొక రచ్చ జరుగుతూ ఉంటుంది. అయితే 'అన్ స్టాపబుల్ 4'లో బన్నీ ఎపిసోడ్ తర్వాత ఇవి కూడా తగ్గిపోయాయి.

'సరిలేరు నీకెవ్వరూ' 'అల వైకుంఠపురములో' సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పటి నుంచీ.. మహేష్ బాబు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. "మహేష్ గారిలో నాకు పర్సనల్ గా నచ్చే విషయం ఏంటంటే, ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంటాయి. ఫెయిల్యూర్ తర్వాత వచ్చే కంబ్యాక్స్ చాలా బాగుంటాయి. దానికి నేను ఆయన్ను చాలా అడ్మైర్ చేస్తాను. ఆయనలో అది నాకు నాకు చాలా ఇష్టమైన విషయం. ఆయన ట్రూ సినిమా లవర్. తెలుగు సినిమా స్టాండర్డ్ ను పెంచిన యాక్టర్. ఆయన మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది'' అంటూ బన్నీ అన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

అలానే "ప్రభాస్ ఆరడుగుల బంగారం. క్రిస్మస్ కి గిఫ్ట్స్ పంపిస్తాడు. ఆయనకు నేనొక మొక్కని గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఆయన ఫామ్ హౌస్ లో చాలా పెద్దగా పెరుగుతోంది'' అంటూ డార్లింగ్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు అల్లు అర్జున్. ఇలా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న నెగిటివ్ విషయాలపై బన్నీ క్లారిటీ ఇచ్చేశారు. ఇతర హీరోలతో తనకు ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని చెప్పకనే చెప్పారు. ఇదంతా ఫ్యాన్ వార్స్ ఆగిపోవడానికి మాత్రమే కాదు.. పరోక్షంగా 'పుష్ప 2' సినిమాకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News