బన్నీతో మళ్లీ కొరటాల చర్చలు.. ఇప్పట్లో సాధ్యమేనా?
కొన్నేళ్ల క్రితం కొరటాల, బన్నీ కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఏమైందో తెలియదు.. ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2: ది రూల్ మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో ఇప్పటికీ దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్సు సాధించి.. బాహుబలి-2, దంగల్ రికార్డ్స్ పై కన్నేసింది.
అయితే బాలీవుడ్ లో పుష్ప-2 మూవీ ప్రభంజనం మామూలుగా లేదు. బీటౌన్ లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఘనత సాధించింది. అలా బన్నీ క్రేజ్ వేరే లెవెల్ కు చేరింది. అదే సమయంలో ఆయన అప్ కమింగ్ చిత్రాలపై అందరి దృష్టి పడింది. కొత్త చిత్రాలతో ఎలా అలరిస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్.. తన నెక్స్ట్ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయనున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ నిర్మాత నాగవంశీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. బన్నీ కాస్త ఫ్రీ అయ్యాక త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తామని రీసెంట్ గా తెలిపారు. స్క్రిప్ట్ వర్క్ పూరైనట్లు వెల్లడించారు.
అదే సమయంలో ఇప్పుడు అల్లు అర్జున్ తో మాస్ డైరెక్టర్ కొరటాల శివ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా దేవర మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు బన్నీతో మూవీ చేసేందుకు చర్చించినట్లు సమాచారం. అయితే ఈ కాంబినేషన్ ఇప్పటిది కాదన్న విషయం తెలిసిందే.
కొన్నేళ్ల క్రితం కొరటాల, బన్నీ కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఏమైందో తెలియదు.. ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పుష్ప సిరీస్ చిత్రాల్లో బన్నీ నటించగా.. కొరటాల దేవర చేశారు. ఇప్పుడు మళ్లీ ఓ స్టోరీని అల్లు అర్జున్ కు కొరటాల శివ నెరేట్ చేశారని సమాచారం.
అయితే ఒకవేళ బన్నీ.. కొరటాల స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమా తెరకెక్కడానికి కచ్చితంగా టైమ్ పడుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ తో సినిమా అయ్యాక.. ఎప్పుడో కమిట్ అయిన సందీప్ రెడ్డి వంగాతో వర్క్ చేయనున్నారు అల్లు అర్జున్. అలా త్రివిక్రమ్, సందీప్ చిత్రాలు పూర్తయ్యేసరికి ఏం లేదన్నా నాలుగేళ్లు కచ్చితంగా పడుతుంది.
దాంతోపాటు పుష్ప-3 కూడా బన్నీ చేయాల్సి ఉంది. అటు కొరటాల చేతిలో దేవర-2 ఉంది. ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఇంకా తెలియదు. కాబట్టి కొరటాల- బన్నీ ప్రాజెక్ట్ సెట్స్ పై వెళ్లడానికి టైమ్ పట్టడం పక్కా అనే చెప్పాలి. అన్నీ కుదిరితే 2030లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..