నాగబాబు ఇంటికి అల్లు అర్జున్... తెరపైకి ఆసక్తికర చర్చ!
అల్లు అర్జున్ అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
అల్లు అర్జున్ అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంటూ నెట్టింట ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే! మరోపక్క ‘పుష్ప-2’ సినిమాను మెగా ఫ్యామిలీస్ బాయ్ కాట్ చేశారనే చర్చ జరిగిందని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన నేపథ్యంలో పైన వినిపిస్తున్నట్లు చెప్పుకున్న ప్రచారాలన్నీ అసత్యాలనే చర్చకు బలం చేకూర్చే ఘటనలు వరుసగా జరుగుతున్నాయి! ఇందులో భాగంగా... అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలియగానే.. చిరంజీవి దంపతులు అల్లు నివాసానికి చేరుకున్నారు.
మరోపక్క అల్లు అర్జున్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో వాదించడానికి అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని కూడా చిరంజీవే ఏర్పాటు చేశారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క... జైలు నుంచి శనివారం విడుదలైన అల్లు అర్జున్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించగా.. ఆదివారం అల్లు అర్జున్ సతీసమేతంగా చిరంజీవి ఇంటికి వెళ్లారు.
ప్రస్తుతం చిరు ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ దంపతుల ఫోటోలు నెట్టింట వైరల్ గా మరాయి. దీంతో... రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉన్నట్లు వస్తున్న ప్రచారాలు పటాపంచలయిపోయాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్ దంపతులు.
అవును.. మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి భార్య స్నేహరెడ్డితో కలిసి వెళ్లారు అల్లు అర్జున్. ఈ సమయంలో తన ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ దంపతులకు నాగబాబు సాదర స్వాగతం పలికారు. అల్లు అర్జున్ ను ఆత్మీయంగా హత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. తాను కష్టంలో ఉన్నప్పుడు మెగా ఫ్యామిలీ అండగా నిలబడటం పట్ల బన్నీ కృతజ్ఞతలు చెప్పారని అంటున్నారు.
ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో నమోదైన కేసులో అరెస్టు, తదనంతర పరిణామాలపై వీరిద్దరి మధ్యా చర్చ జరిగిందని అంటున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ మాత్రం అల్లు అర్జున్ ను కలవకుండానే హైదరాబద్ నుంచి నేరుగా ఏపీకి వెళ్లారని అంటున్నారు. అల్లు అర్జున్ మాత్రం ఆదివారం మెగా ఇంటి బాట పట్టారు. చిరు ఇంట్లో లంచ్ చేశారు!