అల్లు అర్జున్ గొప్ప మనసు.. శ్రీతేజ్ కోసం సింగపూర్ నుంచి ఇంజెక్షన్!

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అందరిని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-12-16 04:48 GMT

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అందరిని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు సుకుమార్‌తో పాటు పుష్ప-2 టీమ్ మొత్తం ఈ పరిణామాలపై తీవ్ర మనస్తాపంలో ఉన్నారు.

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మరోసారి ఈ ఘటనపై స్పందిస్తూ.. దురదృష్టకర సంఘటన తర్వాత నిరంతరం వైద్య సంరక్షణలో ఉన్న యువ శ్రీ తేజ్ గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయపరమైన విచారణల కారణంగా, ఈ సమయంలో అతని కుటుంబాన్ని సందర్శించవద్దని నాకు సూచించబడింది. వారి వైద్య, కుటుంబ అవసరాలను తీర్చడానికి నేను బాధ్యత వహించడానికి కట్టుబడి ఉన్నాను. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబాన్ని వీలైనంత త్వరగా కలవాలని నేను ఎదురుచూస్తున్నాను.. అన్ని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు.

శ్రీతేజ్‌ ఆరోగ్య సంరక్షణ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు నిర్మాతలు తమ బాధ్యతగా నిలబడుతున్నారు. ఘటన జరిగిన రోజు నుంచే హాస్పిటల్ ఖర్చులన్నింటిని వారు స్వయంగా భరిస్తున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో కూడా శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నీ తాము భరించడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఇటీవల వైద్య చికిత్సలో భాగంగా శ్రీతేజ్‌కు అత్యవసరమైన ఇంజెక్షన్ అవసరమయ్యింది. దీనిని సింగపూర్ నుంచి తెప్పించి చికిత్సలో ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకున్నారు. అల్లు అర్జున్ పట్ల అభిమానులు, ఇండస్ట్రీ వారు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్ నుంచి ఇంజెక్షన్ తెప్పించడం ఒక పక్క ఖరీదైన వ్యవహారం అయినప్పటికీ, వారి ప్రాణానికి విలువ ఇస్తూ ఎలాంటి ఖర్చుకు వెనకాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అల్లు అర్జున్ తన తరఫున 25 లక్షల రూపాయలను ప్రకటించి, తాను ఎల్లప్పుడూ శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు. హాస్పిటల్ ఖర్చులు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా తాను వెన్నంటే ఉంటానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సహాయం వలన శ్రీతేజ్ కుటుంబానికి కొంత ఊరట లభిస్తోంది.

దుర్ఘటన జరిగినప్పటి నుంచి నిర్మాత బన్నీ వాస్, మైత్రీ మూవీ మేకర్స్, హీరో అల్లు అర్జున్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీతేజ్ ఆరోగ్యంపై అప్డేట్స్‌ను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా బన్నీ వాస్ తరుచుగా హాస్పిటల్‌కు వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను సంప్రదిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తూ నిమగ్నమై ఉన్నారు. ఈ విధంగా అర్థం చేసుకున్న నిర్మాతల బాధ్యతతనంతో పాటు, టాలీవుడ్‌లోనూ వారి సంస్కారం స్పష్టమవుతోంది.

మొత్తానికి, అల్లు అర్జున్ వ్యక్తిగతంగా శ్రీతేజ్ ఆరోగ్యం కోసం తగిన సహాయం అందిస్తూ, తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. ఈ ఘటన పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున సహాయ హస్తం అందించిన అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్‌ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప-2 టీమ్ అండగా నిలిచిన ఈ చర్య మరింత ఆదర్శప్రాయంగా నిలిచింది. శ్రీతేజ్ త్వరగా కోలుకుని ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తారని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News