టాలీవుడ్ ప్రీరిలీజుల్లా అంబానీ ఇంట ప్రీపెళ్లిల్లు!
టాలీవుడ్ ప్రచారపుటెత్తుగడల్లో దుంప తెంచేస్తోంది! ప్రీప్రచారంలో హోరెత్తించేయడంలో మన ఘనాపాటీల ముందు ఎవరైనా దిగదుడుపే
టాలీవుడ్ ప్రచారపుటెత్తుగడల్లో దుంప తెంచేస్తోంది! ప్రీప్రచారంలో హోరెత్తించేయడంలో మన ఘనాపాటీల ముందు ఎవరైనా దిగదుడుపే!! బాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ శాండల్వుడ్ లో లేనంతగా ప్రీరిలీజ్ ప్రమోషన్లతో మోతెక్కించేయడం కేవలం టాలీవుడ్ లోనే చూడగలం!
ఈ ఫంక్షన్ల కోసం నిర్మాతలు లక్షలు, కోట్లు వెదజల్లుతారు. అధునాతన సాంకేతికతతో ఎల్ఇడిలు, ఎల్‌సిడి స్క్రీన్లు, పెద్ద విలేజీని తలపించేలా భారీ స్టేజ్ లు నిర్మిస్తారు. స్టార్లకు వందల అడుగుల ఎత్తైన కటౌట్లను వేదికల వద్ద ఏర్పాటు చేస్తారు. బారికేడ్లతో అడ్డుకట్టలు వేస్తారు. చుట్టూ అభిమానుల వీరంగంతో రణరంగంలా మారుతుంది వేదిక. మళ్లీ ఇలాంటి వేడుకల్ని ఎక్కడ చూడగలం? అంటే.. కచ్ఛితంగా అంబానీ ఇంట మాత్రమే చూడగలం. అయితే ఇక్కడ ప్రీరిలీజ్ వేడుకలు ఎలాగో అక్కడ ప్రీపెళ్లిల్లు (ప్రీవెడ్డింగులు) అలాగన్నమాట!!
అంబానీ ఇంట పెళ్లి అంటే.. టాలీవుడ్ లో ప్రీరిలీజ్ ఫంక్షన్లలా ప్రీవెడ్డింగులు అలా నిరంతరాయంగా సాగుతూనే ఉంటాయి. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి ఇప్పటికే రెండు ప్రీవెడ్డింగులు అయ్యాయి. ప్రీపెళ్లి -1 గుజరాత్ జామ్ నగర్‌లో లక్షలాది అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇప్పుడు క్రూయిజ్ షిప్ లో ప్రీపెళ్లి -2 అంతకంటే వైభవంగానే జరిపిస్తున్నాడు అంబానీ. దీనికోసం వరల్డ్ క్లాస్ అతిథుతు అటెండయ్యారు. భారీతనం నిండిన అత్యంత విలాసవంతమైన షిప్‌లో ఈ ప్రీవెడ్డింగ్ కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడు అంబానీ.
అయితే ఈ రెండు పెళ్లిళ్లతో ఇది సరిపోలేదు. మూడోది అసలు పెళ్లి ఉండనే ఉంది. ఇది జియోవరల్డ్ సెంటర్ లో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ అసలు పెళ్లి మొదటి రెండు పెళ్లిళ్లను కొట్టేలా ఆకాశమంత పందిళ్లతో నిత్య కోలాహాలంతో సంబరంగా జరగనుంది. అంతేకాదు ఈ ప్రీపెళ్లిళ్లకు, ఓవరాల్ గా సాగే పెళ్లి తంతుకు అంబానీలు ఉచితంగా బోలెడంత ప్రచారం కొట్టేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
మీడియా వద్దన్నా మీద పడుతుంది. అదే పనిగా కవరేజీలు ఇస్తుంది. ఇక్కడ (టాలీవుడ్ లో) వందల కోట్లు జనం నుంచి లాగడం కోసం ప్రమోషన్ అవసరం. అక్కడ వందల కోట్లు జనాల వినోదం కోసం విసురుతున్నారు అంబానీలు. ఈ రెండిటికీ ప్రమోషన్ అనేది కామన్. టాలీవుడ్‌లో ప్రీరిలీజుల్ని ప్రవేశపెట్టిన మహానుభావుడిని ఇప్పటికీ ప్రజలు, మీడియా ప్రతినిథులు తలుచుకుంటారు. అలాగే ప్రీవెడ్డింగుల్ని కనిపెట్టిన అంబానీలను కూడా అదే ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు! నిజానికి అంబానీలకు ఈ క్రేజీ ఐడియా ఇచ్చింది ఎవరు? అంటే.. టాలీవుడ్ మహానుభావులే అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయ్!!
ఈ రెండిటా.. సారూప్యతలు ఒకేలా ఉన్నా కానీ, జనాలకు కావాల్సినంత విందు వినోదం అంబానీల పెళ్లిలో ఉంటుంది.. కానీ టాలీవుడ్ లో ప్రచారం పేరుతో బొప్పి కట్టిస్తారనేది ఒక అభిప్రాయం!!