చెక్ బౌన్స్ కేసులో స్టార్ హీరోయిన్ రాజీ బేరం

రాంచీకి చెందిన సినీ నిర్మాత అజయ్ కుమార్ సింగ్ అమీషా పటేల్‌పై మ్యూజిక్ సిట్టింగ్స్ నెపంతో దోపిడీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.

Update: 2024-03-09 08:18 GMT

చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి ప్ర‌ముఖ క‌థానాయిక‌ అమీషా పటేల్ మార్చి 5న‌ రాంచీలోని సివిల్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండ‌గా గైర్హాజరైంది. వ్యక్తిగత కారణాలను చూపుతూ వాయిదా వేయాలని ఆమె లాయర్ అభ్యర్థించారు. దీనికి ప్రతిస్పందనగా ఫిర్యాదుదారు తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ పొడిగింపు కోసం ఇటువంటి అభ్యర్థనల కారణంగా కేసు చాలాసార్లు ఆలస్యం అయిందని పేర్కొన్నారు. అమీషాకు ఒక చివరి అవకాశం ఇస్తూ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ DN శుక్లా ఆమెను తదుపరి షెడ్యూల్ తేదీలో కోర్టుకు హాజరుకావాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 313 కింద ఆమె వాంగ్మూలాన్ని అందించాలని ఆదేశించారు.

 

2018 నాటి ఈ గొడ‌వ‌లో ఎట్ట‌కేల‌కు అమీషా రాజీ బేరం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌నేది తాజా వార్త‌. రూ. 2.5 కోట్ల అప్పును మ‌రో 25ల‌క్ష‌ల వ‌డ్డీతో మొత్తం చెల్లించేందుకు మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా ఒప్పందం ఖ‌రారు చేసుకున్నార‌ని తెలిసింది. తొలి విడ‌త‌గా రూ.20ల‌క్ష‌లు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపిన‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. వివాదం పూర్వాప‌రాల్లోకి వెళితే.. ఈ కేసు 2018 నుంచి కోర్టులో న‌లుగుతోంది.

రాంచీకి చెందిన సినీ నిర్మాత అజయ్ కుమార్ సింగ్ అమీషా పటేల్‌పై మ్యూజిక్ సిట్టింగ్స్ నెపంతో దోపిడీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. దేశీ మ్యాజిక్ అనే సినిమా నిర్మాణానికి సంబంధించి అమీషా పటేల్ తన నుంచి రూ.2.5 కోట్లు అందుకున్నారని ఆరోపించారు. వారి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. జూన్ 2018లో తొలి అంగీకారం ప్ర‌కారం సినిమా విడుదల చేయ‌లేనందున అమీషా నుండి తిరిగి త‌న డ‌బ్బు చెల్లించమని అజ‌య్ సింగ్ డిమాండ్ చేశాడు. ప‌లుమార్లు అమీషాకు గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేసినా కానీ, ఆమె వాయిదా వేసింది. చివరికి అక్టోబర్ 2018లో మొత్తం రూ. 2.5 కోట్ల 50 లక్షల చెక్కులను జారీ చేసింది. అయితే అవి రెండూ బౌన్స్ అయ్యాయి. పలుమార్లు సమన్లు పంపినప్పటికీ అమీషా పటేల్ వ్యక్తిగతంగా గానీ, తన లాయర్ ద్వారా గానీ కోర్టుకు హాజరుకాలేదు. తదనంతరం అమీషా అరెస్టుకు వారెంట్ జారీ అయింది. గత సంవత్సరం జూన్ 19 న ఆమె సివిల్ కోర్టులో లొంగిపోయేలా చేసింది. విచారణ అనంతరం కోర్టు ఆమెకు రూ.10,000 చొప్పున త‌యారైన‌ రెండు బాండ్లపై బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు కోర్టు వెలుప‌ల చెక్ బౌన్స్ కేసును ప‌రిష్క‌రించుకునేందుకు అమీషా చొర‌వ చూప‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

తండ్రితోను ఆర్థిక వివాదాలు:

2004లో అమీషా పటేల్ త‌న తండ్రిపై ఆర్థిక దుర్వినియోగానికి పాల్ప‌డ్డారంటూ అభియోగాలు మోపారు. దాంతో ఇరువురు ఆర్థిక మరియు చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్నారు. ఇది వారి వ్యక్తిగత విభేదాలను బ‌హిర్గ‌తం చేసింది. డ‌బ్బుతో ముడిప‌డిన‌ స‌మ‌స్య‌లు అమీషా ఇమేజ్ ని డ్యామేజ్ చేసాయి. తండ్రి కూతుళ్ల న‌డుమ‌ స‌రైన స‌త్సంబంధాలు లేక‌పోవ‌డం.. వివాదాస్పద వ్యాపార వెంచర్‌లకు సంబంధించిన సమస్యలకు ఆజ్యం పోశాయి. అమీషా తన తండ్రి తన ఆర్థిక వ్యవహారాలను తప్పుదారి పట్టించాడని, తన వృత్తిపరమైన బాధ్యతలను తప్పుగా సూచించాడని .. అనుమతి లేకుండా తన ఆస్తులను చట్టవిరుద్ధంగా ఉపయోగించాడని అమీషా ప‌టేల్ ఆరోపించారు. ఇప్పుడు నిర్మాత‌తో ఆర్థిక లావాదేవీల్లో గొడ‌వ ప‌డ‌టం కూడా చ‌ర్చ‌కు తెర తీసింది.

Tags:    

Similar News