సర్వేలన్నీ సీఎం వైపే!... అనకాపల్లిలో ఏమి జరుగుతుంది?

అవును... ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్ సభ స్థానంలో రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది

Update: 2024-06-02 07:23 GMT

ఏపీలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించేశాయి. ఈ ఫలితాల విడుదల అనంతరం ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయని కొందరంటుంటే.. ఎగ్జిట్ పోల్ ఫలితాలకూ వీటికీ ఏమాత్రం సంబంధం ఉండదని మరికొంతమంది చెబుతున్న పరిస్థితి. ఈ సమయంలో అనకాపల్లి లోక్ సభ స్థానంపై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

అవును... ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్ సభ స్థానంలో రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా... ఇక్కడ బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ గెలవబోతున్నారని చెబుతున్నారు. తాజాగా వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ మేరకు ఈ విషయాన్నే బలపరుస్తున్నాయని అంటున్నారు.

అనకాపల్లిలో సీఎం రమేష్ “పువ్వు” గుర్తుపై పోటీ చేసినప్పటికీ... కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఈ మాజీ టీడీపీ నేతకు స్థానిక టీడీపీ, జనసేన నేతల సహకారం పూర్తిగా దక్కిందని చెబుతున్నారు. దక్కని చోట ఈయన తన 'బలం'తో దక్కించుకోగలిగారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! చివరి నిమిషంలో చిరంజీవి సపోర్ట్ కూడా కలిసొచ్చిందని అంటున్నారు.

వాస్తవానికి.. అనకాపల్లిలో లోకల్ కేండిడేట్ కే అధిక ప్రిఫరెన్స్ ఉంటుందనే చర్చ ఎన్నికల ముందు బలంగా వినిపించింది. ఈ సమయంలో జనసేన టిక్కెట్ వదులుకుందనే చర్చా నడిచింది. అయితే లోకల్ కాదు కదా.. పక్క జిల్లా కూడా కాకుండా.. సుమారు పది జిల్లాల అవతల నుంచి వచ్చి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు సీఎం రమేష్. అది కూడా బీజేపీ నుంచి కావడం గమనార్హం.

అనకాపల్లి టిక్కెట్ కన్ఫాం అని తెలిసినప్పటి నుంచీ సీఎం రమేష్ పూర్తిగా తనదైన చాణక్యాన్ని స్థానికంగా ప్రదర్శించారని అంటున్నారు. అక్కడ రూరల్ లో టీడీపీ బలంగా ఉండటంతో పాటు.. జనసేన జనాలను కూడా బాగా కలుపుకుని ముందుకు కదిలారని చెబుతున్నారు. అయితే... ఈ ఫలితాలు, అంచనాలతో వైసీపీ ఏమాత్రం ఏకీభవించడం లేదు.

అనకాపల్లిలో స్థానికుడైన వైసీపీ అభ్యర్థికే జనం పట్టం కడతారని నొక్కి చెబుతున్నారు. చూస్తూ ఉండండి.. అనకాపల్లిలో ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాట్ ఫలితాలకూ ఏమాత్రం సంబంధం ఉండదని నొక్కి చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం చూసిన కోణంలో ఇచ్చే అంచనాలు మాత్రమే అని చెబుతున్నాయి! అయితే ఈ విషయంలో వైసీపీ మాటలను కూడా కొట్టివేయలేని పరిస్థితి.

కారణం... కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని అటు వైసీపీ నేతలకు, ఇటు టీడీపీ నేతలకు తెలిసిన కొన్ని స్థానాల్లో కూడా అనూహ్యంగా టీడీపీ గెలుపును కన్ఫాం చేస్తూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయని చెబుతున్నారు. దీంతో... ఆ విషయాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. అనకాపల్లి అసలు ఫలితం వచ్చే వరకూ అగమని అంటుంది.

Tags:    

Similar News