ఆషాఢంలో అంబానీ ఇంట పెళ్లేంటి?
ఆషాఢం మొదలవుతుందంటే తెలుగు సంప్రదాయం ప్రకారం ఎలాంటి కార్యక్రమాలు చేయరు.
ఆషాఢం మొదలవుతుందంటే తెలుగు సంప్రదాయం ప్రకారం ఎలాంటి కార్యక్రమాలు చేయరు. ముఖ్యంగా పెళ్లిళ్లు జోలికైతే అస్సలు వెళ్లరు. అత్తగారింటికెళ్లి భార్యని చూసే అవకాశం కూడా భర్తకు ఉండదు. అంత సెంటిమెంట్ గా ఆషాఢంని తెలుగు ప్రజలు భావిస్తారు. ఆషాఢ సీజన్ లో ఏ కార్యక్రమం చేపట్టినా దిగ్విజ యంగా పూర్తవ్వదు..ఆటంకాలు ఎదురవుతాయని బలంగా నమ్ముతారు. సినిమా ప్రారంభోత్సవాలు కూడా ఆషాఢ మాసంలో జరగవు.
ఆ నెల వెళ్లిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని ఠెంటాక కొడుతుంటారు. అయితే సరిగా ఆషాఢ మాసంలో అంబానీ ఇంట పెళ్లి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆషాఢం పీక్స్ లో ఉన్న సమయం లోనే అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం నిన్నటి రోజున ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అతిరధ మహారధులంతా హాజరయ్యారు. ఎంతో ఘనంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జరిపించారు. ప్రపంచమే నివ్వెర పోయేంత వైభవంగా పెళ్లి జరిగింది.
దీంతో తెలుగు ప్రజలంతా ఆషాఢంలో పెళ్లేంటి? విచిత్రంగా ఉంది? సంప్రదాయానికి విరుద్దంగా ఉందేంటి? అన్న చర్చ కనిపిస్తుంది. అయితే ఈ ఆషాఢం సెంటిమెంట్ అనేది కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం. అందుకు బలమైన కారణం ఉంది. తెలుగు వారంతా అనుసరించేది చాంద్రమాన పంచాంగం. కానీ ఉత్తరాది వారంతా సూర్యమాన పంచాగం అనుసరిస్తారు. సూర్యుడి కధలికల ఆధారంగా నిర్ణయించే దీనిలో అధిక మాసం ఉండదు.
అందుకే తిధులు, ముహూర్తాల ఆచరణలో చాలా తేడాలుంటాయి. ధృక్ గణితం ఆధారంగా పండితలు ఈ ముహూర్తాన్ని పెట్టినట్లు తెలుస్తోంది. మనది చాంద్రమాన పంచాగం కాబట్టి..రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పోలిక చేస్తే పెళ్లిళ్ల సీజన్ పూర్తి కాంట్రాస్ట్ గా కనిపిస్తుంది.