అంబానీ వెడ్డింగ్ కోసం ఊహించని డెస్టినేషన్!
కానీ ఈ ఊహాగానాలకు విరుద్ధంగా, అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంప్రదాయాన్ని గౌరవించి ముంబైలో పెళ్లి వెన్యూని ఎంచుకున్నారని కథనాలొస్తున్నాయి.
గుజరాత్ జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం ఆసియా ధనికుడు ముఖేష్ అంబానీ 1000 కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం పెళ్లి వేడుకల కోసం సుమారు 5000 కోట్లు పైగా ఖర్చు చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రీవెడ్డింగ్ ముగింపు ఉత్సవాల్లో హస్తక్షర్ వేడుక తర్వాత, అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ఇప్పటికి తమ వివాహ తేదీని అధికారికంగా ప్రకటించారు. ముకేశ్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ అతడి ప్రియమైన రాధికల వివాహం 12 జులై 2024న జరగనుంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. లండన్ లేదా అబుదాబిలో పెళ్లి వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఇంతకుముందు వెల్లడైంది. కానీ ఈ ఊహాగానాలకు విరుద్ధంగా, అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంప్రదాయాన్ని గౌరవించి ముంబైలో పెళ్లి వెన్యూని ఎంచుకున్నారని కథనాలొస్తున్నాయి.
నగరంలో విలాసవంతమైన వేడుకల్లో పెళ్లి ప్రమాణాలు పూర్తి చేసుకున్న అతని పెద్ద తోబుట్టువులు ఆకాష్, ఇషాల అడుగుజాడల్లో దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలో వివాహాన్ని నిర్వహించాలని అనంత్ నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇది అంబానీ కుటుంబ సంప్రదాయం. నగరంతో లోతుగా పాతుకుపోయిన అనుబంధానికి, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా భావించాలి.
లండన్‌లో పెళ్లి అని ప్రచారం:వాస్తవానికి రెండు వారాల క్రితం 12 జూలై 2024న వివాహ తేదీని నిర్ణయించారని కథనాలొచ్చాయి. కానీ వెన్యూ గురించి వివరాలు తెలియలేదు. ఇంతలోనే యునైటెడ్ కింగ్‌డమ్- లండన్‌లోని అంబానీ స్టోక్ పార్క్ ఎస్టేట్‌లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించనున్నారని కథనాలొచ్చాయి.
UKలో అంబానీలకు చెందిన 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ విలువ రూ.600 కోట్ల కంటే ఎక్కువ. ఇది లండన్‌లోని బకింగ్‌హామ్‌షైర్ కౌంటీలో ఉంది. ఇందులో 13 టెన్నిస్ కోర్ట్‌లు, 4000 చదరపు అడుగుల జిమ్ స్థలం, అద్భుతమైన రెస్టారెంట్ ఉన్నాయి. అయితే తాజా సమాచారం మేరకు లండన్ లో కాకుండా ముంబైలోనే అంబానీ వెడ్డింగ్ జరగనుందని కథనాలొస్తున్నాయి. దుబాయ్ - అబూదబీలో సంగీత్ కార్యక్రమం జరుగుతుందని కథనాలొస్తున్నా కానీ అధికారిక సమాచారం లేదు.