'నాకు తెలిసిన సినిమా ఇదే. నేను అదే తీస్తా'.. ట్రోలర్స్ కు రావిపూడి స్ట్రాంగ్ కౌంటర్!

టాలీవుడ్ లో ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి.

Update: 2025-01-17 12:43 GMT

టాలీవుడ్ లో ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. లేటెస్టుగా విక్టరీ వెంకటేష్ తో ఆయన తీసిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దీంతో వరుసగా 8 హిట్లు అందుకున్న దర్శకుడిగా, బ్యాక్ టూ బ్యాక్ ఐదుసార్లు 100 కోట్ల క్లబ్ లో చేరిన డైరెక్టర్ గా అనిల్ అరుదైన ఘనత వహించారు. అయినప్పటికీ అతను క్రింజ్ కామెడీ సినిమాలు తీస్తాడని, 'రాడ్ పూడి' అంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. అలాంటి వారికి అనిల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. థియేటర్స్ లో ప్రేక్షకుల చేత విజల్స్ వేయించే సినిమాలు చేయడం తనకు ఇష్టమని, తనకు తెలిసిన అలాంటి సినిమాలనే చేస్తానని ప్రకటించారు.

తాజాగా పొంగల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''సినిమా రిలీజ్ కు ముందు సంక్రాంతికి రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్. రిలీజ్ అయ్యాక ఓర్నీ ఏంది ఈ సినిమా అనే టెన్షన్ మొదలైంది. మేము ఊహించిన దానిమంటే సినిమాని ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిన ఆడియన్స్ కి నా పాదాభివందనాలు. ఈరోజు నాకు ఎనిమిది హిట్లు, సక్సెస్ లు అంటున్నారు. మీ సపోర్ట్ లేకపొతే నాకు ఏ విజయం వచ్చేది కాదు. సినిమా రిలీజైన తర్వాత ప్రేక్షకులు మమ్మల్ని సంకన ఎత్తుకొని 'బాబూ.. మీ సినిమా హిట్టు' అని చెబుతారులే అనుకున్నా. కానీ సినిమా హిట్టయ్యాక బాహుబలిని శివగామి ఎత్తుకొని చూపించినట్లు ఆడియన్స్ 'ఇదిరా మీ సంక్రాంతి సినిమా' అనే విధంగా పైకెత్తుకుని చూపించడం గూస్ బంప్స్ లా వుంది. అందరికీ థాంక్యూ సో మచ్'' అని అన్నారు.

''నాకు విజయాన్ని అందించే ప్రేక్షకుల కోసం, డబ్బులు కొని సినిమా చూసే ఆడియన్స్ కోసం.. నేను మా సినిమాని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్లి అమ్మటానికి కూడా రెడీ. అలానే సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్లి ఎలా ఉందని కనుక్కోడానికి కూడా రెడీ. ఎందుకంటే ఆడియన్స్ ను నేను గౌరవిస్తాను. మీరు లేకపోతే మేము లేము. దిల్ రాజు, శిరీష్ ఆరోజు 'పటాస్' సినిమా చూసి రైట్ టైములో రిలీజ్ చేసారు. నన్ను డైరెక్టర్‌గా నిలబెట్టింది కళ్యాణ్ రామ్ గారు అయితే, దానిని మార్కెట్లోకి తీసుకువెళ్ళింది దిల్ రాజు గారు. వాళ్ళిద్దరికీ నేనెప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అక్కడి నుంచి వారితో మా ప్రయాణం స్టార్ట్ అయింది. మాకు ఎక్కడో చోట వేవ్ లెన్త్, కమ్యూనికేషన్, ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. ఇక్కడే ఉండు అనిల్ అని వాళ్ళ కాంపౌండ్‌లో నన్నేమీ కట్టేయలేదు. నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు. వాళ్ళతో నాకు కనెక్ట్ ఉంది కాబట్టి వాళ్లతో నేను సినిమాలు చేస్తున్నాను.. చేస్తూనే ఉంటాను. ఎస్వీసీ నా హోం బ్యానర్. ఎల్లప్పుడూ నేను మీతోనే ఉంటాను''

''సంక్రాంతి సినిమా నిర్మాతలకు ఎంతో స్పెషల్.. ఎన్నో విధాలుగా నాకు కూడా స్పెషల్. రైటింగ్ టీమ్, ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. ఐశ్వర్య రాజేశ్‌ పోషించిన భాగ్యం పాత్రకు ఆడవాళ్ళందరూ బాగా కనెక్ట్‌ అయ్యారు. మీనాక్షి చౌదరి కూడా ఇంతకముందు చేయని క్యారక్టర్ లో బాగా నటించింది. ఐశ్వర్యతో కలిసి కామిక్ టైమింగ్ తో అలరించింది. బుల్లిరాజుకి చిన్న వయసులో పెద్ద పేరు వచ్చింది. ఓటీటీ వెబ్ సిరీసులు పిల్లలు చూస్తే ఇలాంటి ప్రమాదం ఉంది అని ఆ పాత్ర ద్వారా చెప్పడానికి ట్రై చేసాం. ఆడియన్స్ తన పాత్రని చాలా స్పోర్టివ్ గా తీసుకొని, బాగా రిసీవ్ చేసుకున్నారు. భీమ్స్ క్రియేట్ చేసి గోదారి గట్టు సాంగ్ ఒక ఊపునిచ్చింది. అక్కడి నుంచి మేం వెనక్కి చూసుకోలేదు. డైరెక్టర్ టేస్ట్ కి తగ్గట్టుగా సాంగ్స్ ఇస్తాడు. లోకల్ ట్యూన్ క్రియేట్ చేయడంలో భీమ్స్ చాలా దిట్ట. భీమ్స్ తో నా జర్నీ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా సక్సెస్ కి ఆడియో పెద్ద ఎసెట్ అయింది''

''వెంకటేష్ తో ఒక అభిమానిలా పని చేశాను. ఈ సినిమాతో మా మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. ఆయనతో ఈ జర్నీ ఇలానే కొనసాగుతుంది. వెంకటేష్ నాకు ఫ్రెండ్, గురు, ఫ్యామిలీ మెంబర్. ఈ సినిమా కోసం నా కంటే ఎక్కువ ఎనర్జీతో పని చేశారు. ఆయన ఎనర్జీ, సపోర్ట్ లేకపోతే మేము అంత బాగా చేసివుండేవాళ్ళం కాదు. సినిమా చర్చల దగ్గర నుంచి సెలబ్రేషన్స్‌ వరకూ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. నన్ను ఇంత బలంగా నమ్మిన వెంకటేష్ కి థాంక్యూ. ఇది మా హ్యాట్రిక్ మూవీ. అంత పెద్ద స్టార్‌ హీరో అయ్యుండీ ఒక్కోసారి తనపై సెటైర్లు వేయించుకోవడానికి ఎప్పుడూ వెనకాడరు. ప్రాక్టికల్‌గా ఉండే మనిషి. ఆయన సపోర్ట్ మర్చిపోలేను''

''చివరగా నా గురించి నేను రెండు మాటలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకూ నేను చేసిన 8 సినిమాలు.. ఒకొక్క సినిమా ఒక్కో జర్నీ. ఇందులో లాస్ట్ 5 సినిమాలు కంటిన్యూగా వందకోట్ల గ్రాసర్స్. లాస్ట్ 5 సినిమాలు యూఎస్ లో వన్ మిలియన్ గ్రాసర్స్. ఒక దర్శకుడిగా ప్రేక్షకులకి ఎంత థాంక్ ఫుల్ గా ఉండాలో అర్ధం కావడం లేదు. తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనం. సినిమా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గురించి చాలామంది స్టడీ చేసి ఉంటారు. రైటింగ్ అంటే ఇది.. క్యారక్టర్ ఆర్క్ అంటే ఇది.. ఆ సీన్ ఇక్కడ పడాలి అంటూ ఏదేదో మాట్లాడాడుతూ ఉంటారు. టెక్నికల్ రివ్యూలు ఇస్తుంటారు. కానీ నాకు అవేమీ తెలియదు. నాకు తెలిసిన సినిమా ఒక్కటే. థియేటర్స్ లో సినిమా నచ్చితే ఒక ఆడియన్ గా విజిల్స్ వేస్తా.. చప్పట్లు కొడతా''

''ఇదే నాకు తెలిసిన సినిమా. నేను అదే తీస్తా. చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమా ఇదే. నేను పెద్దగా చదువుకోలేదు. థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొడితే నేనూ చప్పట్లు కొడతా. విజల్ కొడితే విజల్ కొడతా.. ఆ క్యారక్టర్ ఎమోషన్ అయితే నేనూ ఎమోషన్ అవుతా. ఏ సినిమా రిలీజైనా ప్రతి ఫ్రైడే థియేటర్ లో వుంటా. నా కంటే బాగా తీస్తే నేర్చుకుంటా. నేను ఏవైనా తప్పులు తీస్తే సరిదిద్దుకుంటా. నా 8 సినిమాల జర్నీ ఇది. ఇక మీద ఇలానే జర్నీ వుంటుంది. మీ అందరి సపోర్ట్ బ్లెసింగ్స్ కావాలి. మీడియా మిత్రులందరికీ థాంక్యూ'' అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News