'సందీప్ వంగా ది గ్రేట్' అని అంగీక‌రించారు!

అత‌డి పేరును ఎక్క‌డా ప్ర‌స్థావించ‌క‌పోయినా కానీ యానిమ‌ల్ కంటెంట్ గురించి చాలా మంది బాలీవుడ్ ఎన‌లిస్టులు గ‌గ్గోలు పెడుతున్నారు.

Update: 2024-01-01 23:30 GMT

'యానిమ‌ల్'ని పొగిడేయ‌డం అంటే సందీప్ వంగాను పొగిడేయ‌డ‌మే. అత‌డి క్రియేటివిటీని అప్ర‌య‌త్నంగా ప్ర‌శంసించ‌డం. అత‌డి పేరును ఎక్క‌డా ప్ర‌స్థావించ‌క‌పోయినా కానీ యానిమ‌ల్ కంటెంట్ గురించి చాలా మంది బాలీవుడ్ ఎన‌లిస్టులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇన్నాళ్లు యానిమ‌ల్ లో నెగెటివ్ కోణాల‌ను మాత్ర‌మే హైలైట్ చేసిన వారంతా ఇప్పుడు ఇందులో పాజిటివ్ కోణాల‌ను కూడా విశ్లేషిస్తున్నారు.

యానిమ‌ల్ కోసం సందీప్ వంగా ఉప‌యోగించిన టెక్నిక్స్ పై ప్ర‌ధానంగా చ‌ర్చ సాగుతోంది. బాలీవుడ్ అన‌లిస్టులు, విమ‌ర్శ‌కులు, ప్ర‌ముఖ పంపిణీదారులు, నిర్మాత‌లు ఇప్పుడు యానిమ‌ల్ ని పదే ప‌దే విశ్లేషించేందుకు ఇష్ట‌ప‌డుతున్నారంటే ఆ ర‌కంగా సందీప్ వంగా అంద‌రినీ ప్ర‌భావితం చేసాడ‌నే దీన‌ర్థం. హీరోయిజం అంటే కొత్త అర్థం చెప్పాడు అత‌డు. రా అండ్ ర‌స్టిక్ గా ఉండే కుర్రాడు, చెడ్డ‌గా ప్రేమించేవాడు.. అతిగా ఆలోచించే వాడిని.. అతిగా ప్రేమించేవాడిని.. తండ్రి కోసం సొంత మ‌నుషుల‌పైనే రివెంజ్ తీసుకునే వాడిని.. ఇలా అన్ని కోణాల్లో హీరోయిజాన్ని చూపించాడు వంగా. ఇది నిజానికి అత్యుత్త‌మ డ్రామాను ఎలివేట్ చేసే కోణం. స్క్రీన్ ప్లేల్లో సీన్ల‌లో ఊహ‌కంద‌ని మెరుపులు మెరిపించేందుకు ఆస్కారం ఉన్న కోణం.

అందుకే ఇప్పుడు 'యానిమల్' బాలీవుడ్ హీరోలకు గేమ్ ఛేంజర్‌గా మారుతుందా? అంటూ ఈ చిత్రంపై కొంద‌రు వాణిజ్య పండితులు తమ దృక్కోణాలను అందించారు. ఇది హీరోలు యాంటీ-హీరోల ప్రొజెక్షన్‌పై గొప్ప చ‌ర్చ‌కు తెర లేపింది. యాంటీ హీరోయిజం అనేది ఇప్పుడే పుట్ట‌క‌పోయినా అందులో కూడా కొత్త‌ద‌నం చూపించాడు సందీప్ వంగా. యాంటీ హీరోయిజం ప్ర‌తిసారీ బాక్సాఫీస్ వద్ద మ‌నీ స్పిన్నర్‌గా మారుతుందని విశ్లేషిస్తున్నారు.

ఎగ్జిబిటర్ కం ట్రేడ్ నిపుణుడు అక్షయే రాఠీ మాట్లాడుతూ.. యానిమల్ అనేది చాలా కోణాల్లో గేమ్ ఛేంజర్ అని అంగీకరించారు. ఇది సినిమా మేకింగ్ స్టైల్ ని మార్చేది. చాలా మంది ప్రజలు అత్యంత క‌నెక్టివ్ ఎలిమెంట్ గా భావించే దాని చుట్టూ తీర్చిదిద్దిన కంటెంట్. ఇది సరైనది .. ఎందుకంటే దూకుడుగా స‌న్నివేశాల్ని ముందుకు న‌డిపించే విధానం ఇందులో ఉంది. ఈ సినిమాలో ఫ‌లానా విష‌యం ఉంది అని ప‌దే ప‌దే మాట్లాడుకునేలా చేసింది యానిమ‌ల్. అది ఒక రకమైన బజ్‌ని సృష్టించింది. ఇది బాక్సాఫీస్ కి కలిసొచ్చింది'' అని అన్నారు.

యాంటీహీరోయిజానికి పెరుగుతున్న‌ ప్రజాదరణపై విశ్లేష‌కుడు రాఠీ ఇలా వ్యాఖ్యానించారు. మాకు(బాలీవుడ్ కు) ఖల్ నాయక్ - డాన్ -డాన్ 2 వంటి సినిమాలు ఉన్నాయి. యాంటీ హీరోయిజం ఉన్న చాలా సినిమాలున్నాయి.. అంతిమంగా యానిమ‌ల్ ఆకర్షణ ఉన్న‌ వినోదాత్మక చిత్రం. నైతికత గురించి యానిమ‌ల్ కథ చెప్పారు. నైతిక‌త‌ ప్రభావం గురించి మరొక రోజు చర్చించాలి అని నేను భావిస్తున్నాను... అని అన్నారు.

యాంటీ-హీరో చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారని మ‌రొక విశ్లేష‌కుడు గిరీష్ వాంఖడే అభిప్రాయపడ్డారు. పుష్ప-కేజీఎఫ్‌-జవాన్ -యానిమల్‌ చిత్రాలతో ఇది నిరూప‌ణ అయింది. ఇలాంటివి మళ్లీ మళ్లీ తెరపైకి వ‌స్తున్న‌ త‌రుణ‌మిది. 'యానిమల్‌' ట్రెండ్‌ అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఈ యాంటీ-హీరో చిత్రాలు బాగా ఆడుతున్నాయి. పాత అమితాబ్ బచ్చన్ రోజుల నుండి సన్నీ డియోల్, షారుఖ్ ఖాన్ వరకు మన భారతీయులు యాంటీ-హీరోల క‌థ‌ల‌ను ఆడించారు. ఇది సామాజికంగా మారుతున్న ప్ర‌జ‌ల‌ మనస్తత్వానికి అద్దం పడుతోంది. 2023లో యానిమల్ తో గుర్తించిన‌ కొత్త యాంటీహీరో మరింత హింసాత్మకంగా, దుర్భాషలాడే స్వభావాన్ని కలిగి ఉన్నాడు. కొంత వరకు విచిత్రంగా ఉంటాడు. అసహ్యకరం అయినా న‌చ్చుతాడు. ఈ సంవ‌త్స‌రం ఆడిన సినిమాల్లో భారీ మోతాదులో హింసతో కూడిన యాక్షన్ జానర్‌కు ఆమోదయోగ్యత ల‌భించింది. భారతీయుల మారిన అభిరుచి ఇలా ఉంది. బహుశా ఇది కొత్త తరం గేమ్ అని భావించాలి. మరింత స్వేచ్ఛతో .. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండే చెడు స్వభావం గల హీరో యువ‌త‌రానికి న‌చ్చుతున్నాడు.. అని అత‌డు విశ్లేషించారు.

కిల్లింగ్ మెషిన్ అయిన ప్రభాస్ 'సలార్' విజయం కూడా బాక్సాఫీస్‌ను జయించటానికి మాకో యాక్ష‌న్‌ హీరోలు తిరిగి వస్తున్నారని సూచించింది. అమితాబ్ బచ్చన్‌ను యాంగ్రీ యంగ్ మాన్ అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు మనం రణబీర్ కపూర్ లేదా ప్రభాస్‌ను 'మాకో యంగ్ మ్యాన్' అని పిల‌వాల‌ని విశ్లేష‌కుడు మ‌నోబాలా అన్నారు. సాఫ్ట్ రొమాంటిక్ హీరోల కంటే మాస్ ఐడెంటిఫై చేసే హీరోలు వ‌స్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు గల మేల్ థియేటర్ల‌కు ఎక్కువ‌గా వెళతారు. వారికి యానిమ‌ల్- స‌లార్ జాన‌ర్ సినిమాలు న‌చ్చుతున్నాయ‌ని విశ్లేషించారు.

ఓవ‌రాల్ గా ఈ చ‌ర్చ‌ను బ‌ట్టి మ‌నం అర్థం చేసుకోవాల్సింది ఒక‌టి ఉంది. 'యానిమ‌ల్' గేమ్ ఛేంజ‌ర్ అవుతుందా? అని విశ్లేషిస్తున్న అన‌లిస్టులు అప్ర‌య‌త్నంగానే సందీప్ వంగా ట్యాలెంట్‌ని ఆకాశానికెత్తేసారు. 'సందీప్ వంగా ది గ్రేట్' అని అంగీక‌రించారు!

Tags:    

Similar News