అంజలీ.. G.G.G!
ఇందులో భాగంగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'గేమ్ ఛేంజర్' వంటి మూడు క్రేజీ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది.
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు. కానీ రచ్చ గెలిచి ఇంట గెలిచిన కథానాయిక ఎవరంటే, అందాల భామ అంజలి అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజోలు ప్రాంతానికి చెందిన ఈ పదహారణాల తెలుగందం.. టాలీవుడ్ లోనే తన కెరీర్ ప్రారంభించినప్పటికీ, క్రేజీ హీరోయిన్ గా మారింది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమలోనే. అక్కడ ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో, విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తిరిగి తెలుగులోకి వచ్చి ఇక్కడా స్టార్ స్టేటస్ అందుకుంది. 18 ఏళ్ల లాంగ్ సినీ కెరీర్ కొనసాగించి, 50 సినిమాల సిల్వర్ జూబ్లీ మైల్ స్టోన్ కి చేరువైంది.
అంజలి ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'గేమ్ ఛేంజర్' వంటి మూడు క్రేజీ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. యాదృచ్ఛికంగా ఈ మూడు సినిమాల పేర్లు కూడా 'G' అనే ఇంగ్లీష్ లెటర్ తోనే ప్రారంభం అవుతుండం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలన్నీ ఈ ఏడాదే విడుదల అవుతుండటం గమనార్హం. వాటిల్లో రెండు ఈ సమ్మర్ లోనే రిలీజ్ అవుతుంటే.. మరో మూవీ ఇయర్ ఎండింగ్ లోపు థియేటర్లలోకి రానుంది.
అంజలి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలలో ‘గీతాంజలి’ ఒకటి. 2014లో వచ్చిన ఈ హారర్ కామెడీ, బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ గా “గీతాంజలి మళ్లీ వచ్చింది” తెరకెక్కుతోంది. శివ తుర్లపాటి దర్శతక్వంలో రూపొందుతున్న ఈ సినిమాని, ఎంవీవీ సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై రచయిత కోన వెంకట్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది అంజలికి 50వ చిత్రంగా ప్రచారం చేయబడుతోంది. ఆమెకు ఎంతో ప్రత్యేకంగా నిలవబోతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ''గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి''. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో ఆమె ఒక వేశ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటి వరకూ ఎన్నో రకాల పాత్రలతో అలరించిన సహజ నటికి ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని చెప్పాలి. ఇది ఆమె కెరీర్ లో ఎప్పటికీ చెప్పుకునే మంచి క్యారెక్టర్ అవుతుందని అంటున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 17న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ''గేమ్ ఛేంజర్'' సినిమాలోనూ అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో చెర్రీ తండ్రీకొడులుగా రెండు పాత్రలు పోషిస్తుండగా.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫాదర్ రోల్ కి ఆమె జోడీగా కనిపించనుంది. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు 50 సినిమా. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2024 దీపావళికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది అన్ని ప్రధాన భాషల్లో విడుదలయ్యే పాన్ ఇండియా మూవీ కాబట్టి, అంజలికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టే అవకాశం వుంది.
ఇలా అంజలి నటిస్తున్న 'గీతాంజలి మళ్లీ వచ్చింది' (Geethanjali Malli Vachindi), 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari), 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమాల టైటిల్స్ 'G' అక్షరంతోనే స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అంజలి GGG' అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రాలకు మంచి బజ్ ఏర్పడింది. ప్రమోషనల్ మెటీరియల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాలు ప్రేక్షకాదరణ పొంది, తెలుగమ్మాయి హ్యాట్రిక్ హిట్స్ అందుకోవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.