అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల జర్నీ.. నాగ్ ఎమోషనల్
అన్నపూర్ణ స్టూడియో ఫౌండేషన్ రాయిని చూపిస్తూ 50 ఏళ్ల క్రితం ఈ స్టూడియోను నాన్నగారు ఎలా ప్రారంభించారో కూడా నాకు అర్థం కాదు.
తెలుగు సినిమా పరిశ్రమ పేరు ఎత్తగానే ఎక్కువ మంది హీరోల పేర్లు, దర్శకుల పేర్లు, నిర్మాతల పేర్లు చెబుతూ ఉంటారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాల్లో దాదాపు 50 నుంచి 60 శాతం సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ల్లో ఏదో ఒకటి అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతాయి. అందుకే టాలీవుడ్ అనగానే అందరికీ గుర్తు రావాల్సిన పేర్లలో అన్నపూర్ణ స్టూడియో ముందు ఉండాలి అనడంలో అతి శయోక్తి లేదు. ఒక దర్శకుడు మైండ్‌లో ఆలోచన పెట్టుకుని అన్నపూర్ణ స్టూడియోస్ గేటు లోనికి వెళ్తే ఒక అద్భుతమైన సినిమాతో బయటకు రాగలిగే స్థాయిలో స్టూడియోలో వసతులు ఉంటాయి.
ఇండోర్, ఔట్ డోర్ లొకేషన్స్ మొదలుకుని పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎంతో అభివృద్ది చెందిన సాంకేతిక పరిజ్ఞానం, ట్రైన్డ్ టెక్నీషియన్స్, నటీనటులు ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన వారు అన్నపూర్ణ స్టూడియోస్‌లో లభిస్తారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాంతో ఇండియాలో ఇప్పటి వరకు లేని సౌండ్ టెక్నాలజీని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించారు. రాజమౌళి ఆధ్వర్యంలో ఆ స్టూడియోను ప్రారంభించిన విషయం తెల్సిందే. అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నాగార్జున నుంచి ఒక వీడియో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అన్నపూర్ణ స్టూడియో ఫౌండేషన్ రాయిని చూపిస్తూ 50 ఏళ్ల క్రితం ఈ స్టూడియోను నాన్నగారు ఎలా ప్రారంభించారో కూడా నాకు అర్థం కాదు. రోడ్లు కూడా లేని ఇక్కడ ఈ స్థాయిలో స్టూడియోను నిర్మించడం ఆయనకే సాధ్యం అయ్యింది అన్నారు. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. అందుకే ఈ స్టూడియోకు అమ్మగారు అయిన అన్నపూర్ణ పేరును పెట్టారు. ఈ స్టూడియోలో ఎక్కడ ఉన్నా అమ్మా నాన్నలతో కలిసి ఉన్న ఫీలింగ్ కలుగుతుందని నాగార్జున అన్నారు. అప్పటి నుంచి స్టూడియోలో వర్క్ చేస్తున్న వారు సైతం ఈ వీడియోలో పాల్గొన్నారు.
ప్రతి సంక్రాంతికి ఏయన్నార్ గారు స్టాఫ్ అందరితోనూ బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. అదే సాంప్రదాయంను మేము కొనసాగిస్తున్నాం. ప్రతి ఏడాది సంక్రాంతికి అన్నపూర్ణ స్టూడియోస్‌లో పని చేస్తున్న వారితో పండుగ జరుపుకుంటామని నాగార్జున అన్నారు. ఇక్కడ పని చేస్తున్న వారిని స్టాఫ్ అని కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్‌గానే మేము చూస్తూ ఉంటాం. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అద్భుతమైన సినిమాలను స్వయంగా నిర్మించి తీసుకు రావడం మాత్రమే కాకుండా ఇక్కడ ఎన్నో సినిమాల షూటింగ్ జరుపుకోవడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోవడంతో టాలీవుడ్‌కి అన్నపూర్ణ స్టూడియోస్ ఇచ్చిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరో వంద ఏళ్లు అన్నపూర్ణ స్టూడియోస్ ఇలాగే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా సినిమాలు అందించాలని కోరుకుందాం.