వెయ్యి కోట్లు... టాలీవుడ్ కి మరో రాజమౌళి
జక్కన్న అడగాలే కానీ వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టేందుకు కూడా చాలా మంది నిర్మాతలు సిద్ధంగా ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వందల కోట్ల బడ్జెట్ తో సినిమాకు ఏ నిర్మాత అయినా రెడీగా ఉంటారు. జక్కన్న అడగాలే కానీ వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టేందుకు కూడా చాలా మంది నిర్మాతలు సిద్ధంగా ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాలీవుడ్ లో ఏ దర్శకుడిపై లేనంత నమ్మకం రాజమౌళి పై ఉంటుంది.
ఇప్పుడు ఆ స్థాయి నమ్మకం హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పై కొందరు నిర్మాతలు ఉంచుతున్నారు. చిన్న సినిమాగా హనుమాన్ ను రూపొందించి ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తో వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమాను తీసేందుకు ఒక ఎన్నారై ఆసక్తి చూపిస్తున్నాడట.
ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేశాడు. హనుమాన్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని తెలియజేశాడు. నువ్వు ఓకే అంటే వెయ్యి కోట్లు పెడతాను సినిమా తీయమని ఒక ఎన్నారై నాతో అన్నాడు అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు.
తనకు మహాభారతం మరియు రామాయణంలను వెండి తెరపై ఆవిష్కరించాలని కోరిక. రాజమౌళి గారు మహాభారతం తీయాలని అనుకుంటున్నారు కనుక ఆ ఆలోచన విరమించుకున్నాను. రామాయణం సినిమాను ఇప్పటికే నితీష్ తివారి తీయాలని భావిస్తున్నారు కనుక నేను ఆ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఆసక్తి గా లేను అన్నాడు.
ఒక వేళ మహాభారతం మరియు రామాయణం సినిమాలను వారు తీయక పోయినట్లయితే తప్పకుండా నేను వాటిని చేస్తాను అన్నట్లుగా ప్రశాంత్ వర్మ తన వ్యాఖ్యల ద్వారా చెప్పుకొచ్చాడు. హనుమాన్ సినిమాలో హనుమాన్ ను కొద్ది మేరకు చూపించిన ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా జై హనుమాన్ లో రాముడు, ఆంజనేయుడి కథ ను చూపించబోతున్నాడు.
ప్రశాంత్ వర్మ తాజాగా దాదాపు ఆరు కోట్ల రూపాయలతో ఖరీదైన కారును కొనుగోలు చేశాడనే వార్తలు వచ్చాయి. అంటే ఆయనకు ఏ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. జై హనుమాన్ సినిమాను వెయ్యి కోట్ల రూపాయల వసూళ్ల టార్గెట్ తో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2025 లో జై హనుమాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.