#డాడీ డాడీ .. ANR 250వ సినిమా జ్ఞాప‌కం

Update: 2023-09-03 12:48 GMT

డాడీ డాడీ 1998 నాటి తెలుగు హాస్య చిత్రం. అక్కినేని నాగేశ్వరరావుకు ఇది 250 వ చిత్రం. శివాజీ గణేశన్, బి. సరోజా దేవి, విజయ్, సిమ్రాన్ నటించిన 1997 తమిళ చిత్రం `వన్స్ మోర్`కి ఇది రీమేక్. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో రామోజీరావు ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, హరీష్, రాశి త‌దిత‌రులు నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం కూర్చారు.

ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తిక‌రం. సిరిసంపదల్లో జన్మించిన ప్రసాదు (హరీష్) తో సినిమా మొదలవుతుంది. అతని తండ్రి ఎప్పుడూ విదేశాలలోనే ఉంటాడు. అతనికి ఉన్న ఏకైక సహచరుడు అతని కజిన్ అంజీ (అలీ). ప్రసాద్ తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటూంటాడు. ఉన్నత జీవనశైలితో, బిజీ షెడ్యూలుతో విసిగిపోతాడు. సాధారణ వ్యక్తిలా జీవించాలనుకుంటాడు. అతను ఒక అందమైన అమ్మాయి సుభద్రను (రాశి) ప్రేమిస్తాడు. కాని అతడు బంధాలు అనుబంధాల పట్ల గౌరవం లేనివాడని తప్పుగా అర్ధం చేసుకుని అతన్ని తిరస్కరిస్తుంది. మరొక వైపు, ఆప్కో అనే అప్పల కొండ (శివాజీ రావు), జిత్తులమారి, సుభద్రను వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. ఈ ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచుతాడు. ఇంతలో, ప్రసాద్ తండ్రి విమాన ప్రమాదంలో మరణిస్తాడు. వ్యాపారం మొత్తం దివాళా తీసే ప‌రిస్థితి. దానికి కొంచెం ముందు, ప్రసాద్ తన తండ్రి ఒక బ్యాంకులో భారీ మొత్తాన్ని సంపాదించాడని తెలుసుకుంటాడు. కాని దాన్ని పొందాలంటే తండ్రి సంతకం తప్పనిసరి. ఎవరో ఒకరిని తండ్రిగా చూపించి ఆ నిధిని తీసుకోవాలని ప్రసాదు, అంజీ ప్లాను వేస్తారు. ఆ సమయంలో, ఆనందరావు (అక్కినేని నాగేశ్వరరావు) అనే కోటీశ్వరుడు నగరం లోకి వస్తాడు. ఒకసారి అతను ఒక పండ్లు అమ్ముకునేవాడి లాగా మారువేషంలో ఉన్నప్పుడు ప్రసాదు తన దుస్థితిని వ్యక్తపరుస్తాడు. తన సిబ్బంది చేసిన మోసం కారణంగానే అతడు దివాలా తీయబోతున్నాడని ఆనందరావు తెలుసుకుంటాడు కూడా. దానికి ప్రాయాశ్చిత్తంగా అతడికి తండ్రిగా నటించేందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఆనందరావు తెలివిగా ప్రసాదును కష్టాల నుండి బయట పడేస్తాడు. సుభద్రతో అతడి ప్రేమ సమస్యను కూడా పరిష్కరిస్తాడు. కొంత సమయం తరువాత, ఆనందరావును ఎప్పటికీ తన తండ్రి గానే ఉండమని ప్రసాద్ కోరినప్పుడు నిజాన్ని ధ్రువీకరిస్తాడు. హృదయపూర్వకంగా అతన్ని ఆలింగనం చేసుకుంటాడు.


అప్పుడు, అపార్థాల కారణంగా సంవత్సరాల క్రితం విడిపోయిన ఆనందరావు భార్య శారద (జయసుధ) తిరిగి వస్తుంది. వారి గతాన్ని తెలుసుకున్న ప్రసాదు, సుభద్రలు వారిని ఏకం చేయాలని నిర్ణయించుకుంటారు. కాని దురదృష్టవశాత్తు, ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. పరిస్థితిని వాడుకుంటూ ఆప్కో, చీలికను పెద్దది చేస్తాడు. సుభద్రను పెళ్ళి చేసుకోవడానికి ప్లాను వేస్తాడు. శారద కూడా తన తప్పును తెలుసుకున్నప్పుడు ఆనంద్ రావు మళ్ళీ ఓ నాటకమాడి వాస్తవాలను ప్రకటిస్తాడు. చివరగా, ప్రసాదు సుభద్రల వివాహంతో సినిమా సంతోషకరంగా ముగుస్తుంది.

అక్కినేని ఇంకా జీవించే ఉన్నారు:

క‌థాబ‌లం ఉన్న ఈ సినిమాలో ఏఎన్నార్- జ‌య‌సుధ జంట న‌ట‌న‌తో పాటు హ‌రీష్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. కోడి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌, ఎల్బీ శ్రీ‌రామ్ మాట‌ల ప‌దును, వందేమాత‌రం సంగీతం ప్ర‌ధాన అస్సెట్స్ గా నిలిచాయి. ఈ సినిమా విడుద‌లై ఇప్ప‌టికి 25 సంవ‌త్స‌రాలు అయింది. 1998 సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల కాగా.. 25 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ అక్కినేని న‌టించిన 250వ చిత్రంగా మ‌ధుర‌జ్ఞాప‌కాల‌ను పోస్ట‌ర్ రూపంలో సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. ఏఎన్నార్ లివ్స్ ఆన్.. అంటూ అభిమానులు ఈ తీపి జ్ఞాప‌కాన్ని విస్త్ర‌తంగా షేర్ చేస్తున్నారు.

Tags:    

Similar News