రేపే ప్రభాస్‌ మూవీ..!

ప్రభాస్‌ ను ఆర్మీ ఆఫీసర్‌ గా చూస్తామనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి.

Update: 2024-08-16 10:46 GMT

ప్రభాస్‌ గత ఏడాది సలార్‌ తో ఈ ఏడాది కల్కి తో భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్ దశలో ఉంది. అతి త్వరలోనే రాజాసాబ్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు మారుతి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో ప్రభాస్ మరో సినిమా కి ఓకే చెప్పాడు. ఆ సినిమాకు సీతారామం చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. ప్రభాస్‌ ను ఆర్మీ ఆఫీసర్‌ గా చూస్తామనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి.

విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్న హను రాఘవపూడి చెప్పిన కథ కి ప్రభాస్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు ఇంత బిజీలో కూడా వెంటనే డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పడంతో ఆ కథ గురించి ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబో మూవీని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా రేపు అంటే ఆగస్టు 17న పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు. ఆ తదుపరి రోజు ఆగస్టు 18 న రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మొదటి షెడ్యూల్‌ ను 20 నుంచి 25 రోజుల పాటు నిర్వహించనున్నారు. అయితే అందులో కేవలం 10 రోజులు మాత్రమే ప్రభాస్ పాల్గొంటాడట. ఇతర రోజుల్లో ప్రభాస్ లేని ముఖ్య నటీనటులు నటించే సన్నివేశాల చిత్రీకరణ చేస్తారని సమాచారం అందుతోంది. కల్కి సినిమాను నిర్మించిన వైజయంతి మూవీస్ వారే ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఫౌజీ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం రిజిస్ట్రర్ చేయించారని, సుభాష్‌ చంద్రబోష్ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి.

ప్రభాస్‌ కల్కి సూపర్‌ హిట్‌ అవ్వడంతో పాటు వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో ముందు ముందు ఆయన నుంచి రాబోతున్న ప్రతి సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని, ప్రతి సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజా సాబ్‌ సినిమా ను దర్శకుడు మారుతి అదే స్థాయిలో ఖర్చు చేస్తూ రూపొందిస్తున్నాడు. కనుక హను రాఘవపూడి కూడా భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభాస్ మరో వైపు సలార్‌ 2 మరియు కల్కి 2 సినిమాలతో పాటు స్పిరిట్‌ సినిమాలకి రెడీ అవ్వబోతున్నాడు.

Tags:    

Similar News