తళా అజిత్, దళపతి విజయ్ ఫ్యాన్స్ మధ్య నిరంతర వివాదాలు, విభేధాల గురించి తెలిసిందే. అగ్ర హీరోలు తమ ఫ్యాన్స్ ని ఎంత వారించినా ఫలితం ఉండదు. చాలా సందర్భాల్లో అభిమానులు సంయమనం పాటించాలని, వారు ఎల్లపుడూ ఆలోచనాపరులుగా ఉండాలని, భావి భారత పౌరులుగా ఎదగాలని అజిత్, విజయ్ కోరుకున్నారు. కానీ అందుకు భిన్నమైన ప్రవర్తన ఫ్యాన్స్ లో కనిపించడం ఆందోళనను కలిగించింది.
అదంతా అటుంచితే, తళా అజిత్ ఇటీవల వరసగా సాధిస్తున్న విజయాలపై ప్రత్యర్థి హీరో దళపతి విజయ్ అస్సలు స్పందించలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆన్ లైన్ లో ఇది పెద్ద డిబేట్ గాను మారింది. తళా అజిత్ ఇటీవల దుబాయ్‌లో ప్రతిష్ఠాత్మక కార్ రేసింగ్ టోర్నీలో విజేతగా నిలిచారు. అలాగే కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అజిత్‌కి కట్టబెట్టింది. కానీ ఈ రెండు సందర్భాల్లో సహచర నటుడు విజయ్ స్పందించలేదని, అజిత్ కి శుభాకాంక్షలు చెప్పలేదనే వాదన బలంగా వినిపించింది. సినీపరిశ్రమ ప్రముఖులంతా అజిత్ కి శుభాభినందనలు తెలియజేసారు. కానీ దళపతి మాత్రం స్పందించలేదని తమిళ మీడియాలోను కథనాలొచ్చాయి.
దళపతి విజయ్ మాత్రమే అజిత్‌కు శుభాకాంక్షలు ఎందుకు తెలియజేయడం లేదని మీడియాలో చాలా చర్చ జరిగింది. దీనికి అజిత్ కుమార్ మేనేజర్ సురేష్ చంద్ర తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ నిచ్చారు. ఈ వాదనలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన అన్నారు. ''అజిత్ రేసింగ్ విజయంపై అభినందించిన మొదటి వ్యక్తి విజయ్. అదేవిధంగా పద్మభూషణ్ అవార్డు ప్రకటించినప్పుడు విజయ్ AK కి శుభాభినందనలు తెలియజేసారు. ఇద్దరూ నిజమైన స్నేహితులు'' అని కూడా తెలిపారు. విజయ్ శుభాకాంక్షలు తెలియజేయలేదనే వాదనలో నిజం లేదని చంద్ర కొట్టి పారేసారు.
2026 లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి అజిత్ అభిమానుల అండదండలు దళపతికి అవసరం. అలాగే ఫిబ్రవరి 6న అజిత్ నటించిన 'విదాముయార్చి' విడుదల కానుండగా, ఈ సినిమా విజయానికి విజయ్ అభిమానుల సపోర్ట్ చాలా అవసరం. ఇలాంటి సమయంలో నిరాధార వార్తలను నమ్మాల్సిన పనిలేదన్న చర్చ సాగుతోంది. ఈ వైరం తగ్గి, పరిస్థితిలో మార్పు రావాలంటే అజిత్- విజయ్ ఒకే వేదికపైకి వచ్చే రోజు రావాలని కూడా పలువురు కోరుకుంటున్నారు.