శోభితతో కలిసి నటించేదప్పుడే: నాగ చైతన్య
ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న తండేల్ సినిమా కచ్ఛితంగా తమ ఆశలన్నింటినీ తీరుస్తుందని అభిప్రాయపడుతున్నారు.
గత కొన్నిరోజులుగా అక్కినేని ఫ్యామిలీకి అసలేం బాలేదు. అక్కినేని హీరోలైన నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఆశలన్నీ నాగ చైతన్య నటించిన తండేల్ పైనే ఉన్నాయి. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న తండేల్ సినిమా కచ్ఛితంగా తమ ఆశలన్నింటినీ తీరుస్తుందని అభిప్రాయపడుతున్నారు.
దీనికి శోభిత సెంటిమెంట్ ను కూడా వారు జోడిస్తున్నారు. అక్కినేని ఇంటికి శోభిత కోడలుగా వచ్చాక రిలీజవుతున్న సినిమా కావడంతో తండేల్ కు లేడీ లక్ కూడా కలిసొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటూ అడిగిన వారందరికీ ఇంటర్వ్యూలిస్తున్నాడు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చైతూ తన భార్య శోభిత గురించి మాట్లాడాడు. శోభితతో ప్రతీ ఒక్క విషయాన్ని ఎంతో ఇష్టంగా పంచుకుంటానని, ఏదైనా తను ఓకే చెప్పాకే నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు చైతూ. వీరిద్దరికీ పెళ్లైంది గత డిసెంబర్ లోనే అయినప్పటికీ గత కొన్నాళ్ల నుంచి వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరిదీ ఒకే రాష్ట్రం కావడం వల్ల ముందుగా కనెక్ట్ అయ్యామని, తర్వాత శోభితకు కూడా సినిమాలంటే పిచ్చి ఉండటం వల్ల ఇద్దరి అభిరుచులూ కలిశాయని, అలా వారిద్దరి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని దాని వల్లే వారి రిలేషన్‌షిప్ ముందుకెళ్లిందని చైతన్య తెలిపాడు. ఇక తన భార్య శోభితతో కలిసి ఎప్పుడు నటిస్తారనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా చైతూకి ఎదురైంది.
దానికి నాగచైతన్య సమాధానమిస్తూ, తను కూడా ఎప్పుడెప్పుడు ఆ ఛాన్స్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కాకపోతే తామిద్దరూ కలిసి నటించే సినిమా స్క్రిప్ట్ చాలా స్పెషల్ గా ఉండాలని అప్పుడే ఇద్దరూ కలిసి సినిమా చేస్తామని నాగచైతన్య తెలిపాడు. చైతూ ఆ మాట చెప్పాక ఎప్పుడెప్పుడు ఈ కాంబోలో సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.