స్కామర్ కామెంట్లపై ఏఆర్ రెహమాన్ కూతురు ఆవేదన
స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే
స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన సారథ్యంలో నిర్వహించిన భారీ కచేరీ నిర్వహణ వైఫల్యంపై ఆడియెన్ తీవ్రంగా ఆరోపించారు. రెహమాన్ స్కామర్ అంటూ విమర్శించారు. చాలా మంది అధిక ధరలకు టికెట్లు కొనుగోలు చేసామని కానీ షో నిర్వాహకులు తీవ్రంగా నిరాశపరిచారని విమర్శలు ఎదురయ్యాయి. ఒక్కో టిక్కెట్టుకు దాదాపు 2500 చెల్లించామని కనీసం వేదిక వద్దకు కూడా చేరలేకపోయామని చాలామంది అభిమానులు, సంగీత ప్రియులు ఆవేదన వ్యక్తం చేసారు.
షో నిర్వహణ వైఫల్యంపైనా, రెహమాన్ పైనా ట్రోలింగ్ ఎంతో తీవ్రంగా మారింది. షో ఆడిటోరియంలో ప్రవేశానికి సరైన ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలమవ్వడంతో భారీ ధరలతో టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి ఈ కచేరీలు ఎల్లప్పుడూ సమస్యాత్మకంగా ఉన్నాయని విమర్శించారు. చెన్నై లో రెహమాన్ సంగీత కచేరీలో తక్కువ ధ్వని నాణ్యత ఉన్న పరికరాలను ఉపయోగించారని కూడా రెహమాన్ ని ట్రోల్ చేశారు. అయితే తన తండ్రిని క్రూరంగా ట్రోల్ చేస్తున్న తీరును రెహమాన్ కుమార్తె ఖతీజా తీవ్రంగా ఖండించారు.
రెహమాన్ ధాతృత్వం గురించి ఖతీజా సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్రం లేదా దేశం సంక్షోభంలో ఉన్నప్పుడల్లా రెహమాన్ అనేక ఛారిటీ షోలను ఎలా నిర్వహించాడనే దానిపై స్పష్ఠతనిచ్చే ఒక ఫోటోని కూడా కుమార్తె ఖతీజా షేర్ చేసారు. తన తండ్రిని అనేవాళ్లంతా మాట్లాడే ముందు ఆలోచించాలని ఖతీజా కోరారు. ఇది కేవలం నిర్వాహకుల వైఫల్యం మాత్రమేనని విమర్శల్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేసారు. తన తండ్రి స్కామర్ అంటూ ట్రోల్ చేస్తున్నారని ఇది సరికాదని ఖతీజా ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఖతీజా వాదనలను ఎవరూ సమర్థించరు. దానికి కారణం ఏదైనా కాన్సెర్ట్ ద్వారా టిక్కెట్లు అమ్మిన డబ్బు మాత్రమే రెహమాన్ ధాతృత్వానికి ఇచ్చారని, సొంత జేబు నుంచి పైసా కూడా తీయలేదని విమర్శించే వాళ్లు లేకపోలేదు.
రెహమాన్ ఇటీవల మణిరత్నం పీఎస్ 1, పీఎస్ 2 చిత్రాలకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. తదుపరి పలు చిత్రాలకు ఆయన సంగీతం అందించనున్నారు. మరోవైపు విదేశీ కచేరీల కోసం ప్రణాళికలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.