100 కోట్ల క్ల‌బ్‌లో లుక‌లుక‌లు

Update: 2018-10-15 13:28 GMT
100 కోట్ల క్ల‌బ్.. 200 కోట్ల అంటూ పోస్ట‌ర్లు వేసేయ‌డం ఫ్యాష‌ నై పోయింది. రిలీజైన మూడో రోజుకే 100 కోట్ల క్ల‌బ్ అంటూ మ‌న నిర్మాతలు బ‌చాయించేస్తున్నారు. అయితే ఇవ‌న్నీ న‌మ్మాలా? అన్న‌ది కొంద‌రు విమ‌ర్శ‌కుల ఆవేద‌న‌. అందుకే అస‌లు ఈ వంద కోట్ల క్ల‌బ్బుల్లో నిజా నిజాలెంత? అంటూ రంధ్రాన్వేష‌ణ‌లు చేస్తుండ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చింది.

ప్ర‌స్తుతం ఏ న‌లుగురు విమ‌ర్శ‌కులు ఒకే చోట గుమిగూడినా ఇదే చ‌ర్చ‌. ఇటీవ‌ల వ‌రుస‌గా 3 సినిమాల‌కు వంద‌కోట్ల క్ల‌బ్ పోస్ట‌ర్లు వేస్తూ మేక‌ర్స్ హ‌డావుడి చేసేశారు. 100 కోట్లు స‌రేలే అనుకుంటే, ఆ త‌ర్వాత‌ 200 కోట్ల క్ల‌బ్ అంటూ పోస్ట‌ర్లు వేశారు. అయితే ఇలా పోస్ట‌ర్లు చూడ‌టానికి అందంగా ఉన్నాయి కానీ, నిజంగానే అంత మొత్తం వ‌సూళ్లు ద‌క్కాయా? అందులో షేర్ ఎంత‌.. ఏ డిస్ట్రిబ్యూట‌ర్‌కి వాస్త‌వంగా ఎంత ద‌క్కింది?  అన్ని ఏరియాల్లోనూ ఒకే త‌ర‌హాలో గొప్ప‌గా క‌లెక్ష‌న్లు వ‌చ్చాయా? అంటూ మాటా మంతీ సాగుతోంది.

అప్ప‌ట్లో రామ్‌చ‌రణ్ `రంగస్థలం` రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకెళుతున్నా, ఎందుక‌నో వెంట వెంట‌నే 100కోట్ల క్ల‌బ్, 200కోట్ల క్ల‌బ్ అంటూ పోస్ట‌ర్లు వేసేయ‌లేదు. కాస్త తాపీగా విజ‌యాన్ని ఖ‌రాకండిగా రూడిగా తెలుసుకున్న త‌ర్వాతే పోస్ట‌ర్లు వేశారు. అయితే ఆ వెంట‌నే వ‌చ్చిన మ‌హేష్ `భ‌ర‌త్ అనే నేను` చిత్రానికి మాత్రం 100 కోట్ల క్ల‌బ్ పోస్ట‌ర్‌, 200 కోట్ల క్ల‌బ్ పోస్ట‌ర్ వేసేసి దాన‌య్య టీమ్ బోలెడంత‌ హ‌డావుడి చేసేసింది. ఆ క్ర‌మంలోనే దానిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తాజాగా ఎన్టీఆర్ `అర‌వింద సేమ‌త` చిత్రం మూడు రోజుల్లో 100కోట్ల క్ల‌బ్‌లో చేరిందంటూ పోస్ట‌ర్ వేసేశారు. ఆ క్ర‌మంలోనే ఇది జెన్యూనేనా? అంటూ ఒక‌టే చ‌ర్చా సాగుతోంది. వాస్త‌వానికి క‌లెక్ష‌న్లు ఒక‌లా ఉంటే, ప్ర‌చారంలో వేరొక‌లా ఉండ‌డం అన్న‌ది ఇప్పుడే కొత్త కాదు కానీ, ఇలా ప్ర‌చారారార్భాటం చేయ‌డం ద్వారా జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డ‌మే దీనివెన‌క ఉన్న ఉద్ధేశ‌మ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. ఎన్టీఆర్ `అర‌వింద స‌మేత‌` 100కోట్ల క్ల‌బ్‌లో చేరిందా.. లేదా? అన్న‌ది అటుంచితే ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ మాత్రం బావుంద‌న్న‌ది వాస్త‌వ‌మ‌ని విశ్లేషించారు. మొత్తానికి బాకా ఊదుడు బ‌చాయించుడు ప్ర‌చారంపై తీవ్రంగానే చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News