ఆ ఒక్క వార్ సీన్‌ కి 45కోట్లు?

Update: 2018-09-16 04:59 GMT
మెగాస్టార్ చిరంజీవి `సైరా-న‌ర‌సింహారెడ్డి` గురించిన ఒక్కో అప్‌ డేట్ హీట్ పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆద్యంతం భారీ యుద్ధ స‌న్నివేశాలు - సాహ‌సాలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేస్తాయ‌న్న స‌మాచారం ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే సురేంద‌ర్‌ రెడ్డి బృందం తీవ్రంగా శ్ర‌మిస్తోంది. అస‌లు రాజీ అన్న‌దే లేకుండా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ అధినేత మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ ఈ సినిమా కోసం బ‌డ్జెట్‌ ని ఖ‌ర్చు చేస్తున్నారు. నాన్న క‌ళ్ల‌లో ఆనందం చూసేవార‌కూ ఎంత‌ బ‌డ్జెట్ అయినా పెడుతామ‌ని టైటిల్ లాంచ్ వేడుక‌లో చ‌ర‌ణ్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. నాన్న‌(చిరు)కు అమ్మ (సురేఖ‌) ఇస్తున్న కానుక ఇద‌ని తెలిపారు. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌స్తుతం ఓ వార్ సీన్ కోసం పెడుతున్న మొత్తం ఎంతో వింటే క‌ళ్లు భైర్లు క‌మ్మాల్సిందే!

భార‌తీయ సినిమా హిస్ట‌రీలో ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని ఓ భీక‌ర‌మైన యుద్ధాన్ని `సైరా - న‌ర‌సింహారెడ్డి` చిత్రంలో చూడ‌బోతున్నాం. ఈ యుద్ధ స‌న్నివేశం ట్రాయ్‌ - గ్లాడియేట‌ర్ వంటి భారీ హాలీవుడ్ సినిమాల క్లైమాక్సుల్ని త‌ల‌ద‌న్నేలా తెర‌కెక్కించేందుకు టీమ్‌ స‌న్నాహ‌కాల్లో ఉంది. యుద్ధం అంటే ఇదీ! అని క‌ళ్ల‌ప్ప‌టించి - కుర్చీ అంచుమీద కూచుని చూడ‌డం ఖాయ‌మ‌న్న మాటా వినిపిస్తోంది. ఈ యుద్ధ స‌న్నివేశ చిత్రీక‌ర‌ణ కోసం.. మెగాస్టార్ & టీమ్ ఇటీవ‌లే జార్జియా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ రెడీగా ఉన్న వార్ సెటప్ యూనిట్‌ కి ఎంతో అనుకూలం. ఇదివ‌ర‌కూ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రానికి ఇక్క‌డే భారీ వార్ ఎపిసోడ్స్‌ ని క్రిష్ తెర‌కెక్కించారు. అక్క‌డ స్థానికంగా వేలాది మంది జూ.ఆర్టిస్టుల్ని వారియ‌ర్ సైనికులుగా ఉప‌యోగించుకున్నారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ వ‌ర్క్ సైరా కోసం జ‌రుగుతోంది.

జార్జియాలో వార్ సీన్స్ తీశాక‌.. వాటిని భారీ వీఎఫ్ ఎక్స్‌ తో మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తానికి అయ్యే ఖ‌ర్చు ఎంతో తెలుసా? ఏకంగా 45- 50 కోట్ల మేర ఖ‌ర్చవుతుంద‌ని తెలుస్తోంది. అంటే ఒకే ఒక్క యుద్ధ స‌న్నివేశానికి బ‌డ్జెట్‌ లో మెజారిటీ భాగం ఖ‌ర్చు చేయ‌నున్నార‌న్న‌మాట‌! 2019 వేస‌విలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నామ‌ని చ‌ర‌ణ్ ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ నాటికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని సైమ‌ల్టేనియ‌స్‌ గా కానిచ్చేస్తారుట‌.
   

Tags:    

Similar News