`MAA ఆంధ్ర‌ప్ర‌దేశ్` నినాదం బ‌లంగా తెర‌పైకి?

Update: 2021-06-30 05:30 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (MAA) రెండుగా విడిపోవాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ .. తెలంగాణ‌ల‌కు విడివిడిగా అసోసియేష‌న్లు ఉండాల‌ని ఇటీవ‌ల అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్న ఆరుగురిలో ఒక‌రైన‌ న్యాయ‌వాది కం న‌టుడు సీవీఎల్ న‌ర‌సింహారావు అన్నారు.  మా తెలంగాణ అసోసియేషన్- మా ఆంధ్రప్ర‌దేశ్‌ అసోసియేషన్ రెండూ కావాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అన్యాయానికి గుర‌వుతున్న తెలంగాణ క‌ళాకారుల కోసం ఈ మార్పు త‌ప్ప‌నిస‌రి అని డిమాండ్ చేశారు.

ఆస‌క్తిక‌రంగా ఆయ‌న ఈ విష‌యాన్ని ఇలా తెర‌పైకి తెచ్చారో లేదో అలా వెంట‌నే `MAA ఆంధ్రప్రదేశ్` ఒక‌టి ఉంద‌న్న సంగ‌తి బ‌య‌టికొచ్చింది. పాత అసోసియేష‌న్ కొత్త‌గా యాక్టివేట్ అయ్యింది. మా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ వ్యవస్థాపకుడైన‌ దర్శకుడు దిలీప్ రాజా వెల్ల‌డించిన విష‌యాలు షాక్ కి గురి చేసాయి.

తెలుగు రాష్ట్రాలు విడిపోయాక‌.. ఏపీలో MAA ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరుతో 24 శాఖ‌లకు సంబంధించిన యూనియ‌న్ ని నెల‌కొల్పామ‌ని రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌తో కార్మిక శాఖ (ప్ర‌భుత్వ‌) ఆమోదం ల‌భించింద‌ని కూడా తెలిపారు. ఈ సంఘంలో ఇప్ప‌టికే టీవీ సినిమా రంగంలోని 24 శాఖ‌ల‌కు చెందిన‌ 500 మంది స‌భ్యులున్నార‌ని దిలీప్ రాజా వెల్ల‌డించారు. ఇందులో న‌టీన‌టులు సాంకేతిక నిపుణులు ఉన్నార‌ని తెలిపారు. తెలంగాణ‌లో మా అసోసియేష‌న్ కి తాము వ్య‌తిరేకం కాద‌ని రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగింది కాబ‌ట్టి తాము యూనియ‌న్ నెల‌కొల్పామ‌ని ఆయ‌న అన్నారు.
Tags:    

Similar News