క్యూట్‌ హీరోకు 'కిరాతక' సెట్‌ అయ్యేనా?

Update: 2021-06-23 10:30 GMT
ప్రముఖ నటుడు సాయి కుమార్‌ నట వారసుడు ఆది సాయికుమార్‌ హీరోగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఇటీవలే శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో ప్లాప్ ను మూట కట్టుకున్నాడు. అయినా కూడా మళ్లీ ఒక సినిమాను షురూ చేసేందుకు సిద్దం అయ్యాడు. గతంలో చుట్టాలబ్బాయి సినిమాను ఆది మరియు వీరభద్రం లు చేశారు. ఆ సినిమా ఫలితం తెల్సిందే. మళ్లీ వారి కాంబోలో ఒక సినిమా రాబోతుంది. కొన్ని నెలల ముందే ఈ ప్రాజెక్ట్‌ ను అధికారికంగా ప్రకటించారు. కాని కరోనా కారణంగా షూటింగ్‌ ను ప్రారంభించలేదు.

ఆది.. వీరభద్రం ల కాంబోలో రూపొందుతున్న సినిమాకు హీరోయిన్ గా పాయల్‌ రాజ్ పూత్‌ ను ఎంపిక చేసినట్లుగా కొత్త అనౌన్స్ మెంట్‌ వచ్చింది. దానికి తోడు ఈ సినిమాకు 'కిరాతక' అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఆది కెరీర్‌ ఆరంభంలో లవర్ బాయ్ పాత్రలు చేశాడు. దాంతో ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్‌ పడింది. అలాంటి ఇమేజ్ ఉన్న ఆది యాక్షన్‌ సినిమా లు చేసినా.. రఫ్‌ పాత్రలు చేసినా కూడా ప్రేక్షకులు ఆధరించడం కష్టం అని ఇప్పటికే నిరూపితం అయ్యింది. అలాంటిది మళ్లీ అదే తరహా సినిమాను వీరభద్రం రూపొందిస్తున్నట్లుగా అనిపిస్తుందని మీడియా సర్కిల్స్ వారు గుసగుసలాడుకుంటున్నారు.

మీడియా వర్గాల అనుసారం.. ఆది వంటి లవ్‌ బాయ్ కమ్‌ క్యూటీ హీరో కు కిరాతక టైటిల్ సెట్‌ అయ్యేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆదికి పాయల్‌ హీరోయిన్‌ గా పక్కన అంతగా నప్పక పోవచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం తాము తెరకెక్కిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్ కు కిరాతక టైటిల్ సరిగ్గా సెట్‌ అవుతుందని.. అలాగే హీరోయిన్ గా తమ కథకు పాయల్‌ సూట్‌ అవుతుందని అంటున్నారు. విలన్‌ నేపథ్యంలో టైటిల్‌ ఉంటే పర్వాలేదు.. అలాగే హీరోయిన్ విషయంలో కూడా కథానుసారంగా నిర్ణయం తీసుకుంటే మంచిదే అన్నట్లుగా మరికొందరు మీడియా మిత్రులు.. నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News