పోస్టర్లే కాదు.. విజువల్స్ కూడా అందంగా ఉన్నాయండోయ్. పబ్లిసిటీ డిజైనింగ్ లోంచి దర్శకత్వంలోకి అడుపెట్టి ఒడుదొడుకుల ప్రయాణం సాగించిన రమేశ్ వర్మ ‘అబ్బాయితో అమ్మాయి’ అనే కొత్త సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. అందమైన పోస్టర్లతో ఆసక్తి రేపిన రమేశ్ వర్మ టీజర్ లను కూడా అందంగా డిజైన్ చేశాడు. బుధవారం ఆడియో ఫంక్షన్ నేపథ్యంలో ఒకేసారి నాలుగు టీజర్ లు వదిలాడు రమేశ్ వర్మ.
ఎందులోనూ డైలాగ్స్ లేవు. వీనుల విందైన ఇళయరాజా బ్యాగ్రౌండ్ స్కోర్ - అందమైన విజువల్స్ తో సినిమా మీద ఆసక్తి పెంచేలా ఉన్నాయి టీజర్లు. మాంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడబోతున్న ఫీలింగ్ కలిగిస్తున్నాయివి. ఐతే రమేశ్ వర్మ తొలి సినిమా ‘ఒక ఊరిలో’ కూడా ఇలాగే మ్యూజిక్ తో, విజువల్స్ తో ఆకట్టుకుంది. కానీ సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడంతో పెద్ద ఫ్లాపైంది.
రెండో సినిమా ‘రైడ్’తో ఫామ్ లోకి వచ్చిన రమేశ్.. మళ్లీ ‘వీర’ లాంటి పెద్ద ఫ్లాప్ తీశాడు. ఇప్పుడు మళ్లీ లవ్ స్టోరీ తీస్తున్నాడు. ఇదో అందమైన ప్రేమ కావ్యమని చెబుతున్న రమేశ్ వర్మకు సంగీత దర్శకుడు ఇళయరాజా, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు బాగానే సపోర్ట్ చేసినట్లున్నారు. నాగశౌర్య - పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్న ఈ సినిమాను నాలుగు చిన్న నిర్మాణ సంస్థలు కలిపి నిర్మిస్తుండటం విశేషం. ఇళయరాజా ముఖ్య అతిథిగా బుధవారమే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ జరగబోతోంది.