ఒక్క ఘ‌ట‌న‌.. ఒకే ఒక్క దాడి.. అన్ని సినిమాలా?

Update: 2019-03-01 06:31 GMT
ఒకే ఒక్క ఘ‌ట‌న‌.. జాతిని మ‌రిగించిన భీతావ‌హ ఘ‌ట‌న‌. 49 మంది సీఆర్‌ పీఎఫ్ జ‌వాన్ల‌ దారుణ‌ హ‌న‌నం.. దాని ప‌ర్య‌వ‌సానం భ‌స్మీప‌ట‌లం... న‌ర‌హంత‌క ఘాతుకాల‌తో చెల‌రేగిపోతున్న పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల భ‌ర‌తం ప‌ట్టింది భార‌త వాయుసేన‌. 300 మంది తీవ్ర‌వాదులపై బాంబుల వ‌ర్షం కురిపించింది. దుష్ఠ‌శ‌క్తుల్ని ఏరి వేయ‌డంలో మ‌న వీరుల ప‌రాక్ర‌మం చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. ప్ర‌మాద‌క‌ర దాయాది దేశంతో వార్ కి కార‌ణ‌మైన బార్డ‌ర్ ఘ‌ట‌న‌పై సినిమా తీసేందుకు ప్ర‌స్తుతం బాలీవుడ్ ఫిలింమేక‌ర్స్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చకు తావిచ్చింది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ మేక‌ర్స్ క‌ళ్ల‌న్నీ పుల్వామా దాడి.. అనంత‌రం భార‌త దేశ వైమానిక దాడులు.. వీరుల వీర‌త్వం నేప‌థ్యంలో క‌థ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ యుద్ధం బ్యాక్ డ్రాప్ క‌థ‌ల్ని సీక్వెల్స్ గా తీసేందుకు బిగ్ స్కెచ్ వేశారు. ఇప్ప‌టికే ప‌లువురు నిర్మాత‌లు టైటిల్స్ ని రిజిస్ట‌ర్ చేసి క‌థ‌ల్ని లాక్ చేసేస్తుండ‌డం చూస్తుంటే.. ఈ వార్ ప్ర‌భావం ఏ రేంజులో ఉందో అర్థ‌మ‌వుతోంది. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్, పుల్వామా ఉగ్ర దాడి ఘటనలను ఇతివృత్తంగా తీసుకొని వ‌రుస‌గా సినిమాలు తీసేందుకు పలు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. `పుల్వామా`,  `సర్జికల్ స్ట్రైక్ 2`, `బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్`,  `పుల్వామా ఎటాక్స్ వర్సెస్ సర్జికల్ స్ట్రైక్ 2.0` ,` సర్జికల్ స్ట్రైక్ 2.0`, `బాలాకోట్`  అంటూ ప‌లు టైటిల్స్ ని రిజిస్టర్ చేసుకుంటున్నార‌ట‌. `వార్ రూం`, `హిందుస్థాన్ హమారా హై`, `పుల్వామా టెర్రర్ అటాక్`, `ద అటాక్ ఆఫ్ పుల్వామా`, `విత్ లవ్`, `ఫ్రం ఇండియా`, `అండ్ ఏటీఎస్`, `ఒన్ మ్యాన్ షో`.. ఇవ‌న్నీ రిజిస్ట‌ర్ చేయించిన‌ టైటిల్సే.

ఇప్ప‌టికే నిర్మాత‌ల సంఘంలో .. ముంబై ఫిలింఛాంబ‌ర్ లో దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప‌లు భారీ క్రేజీ నిర్మాణ‌ సంస్థల ఇందుకోసం ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతున్నాయ‌ని ప్ర‌ఖ్యాత హ‌ఫింగ్ట‌న్ పోస్ట్ పేర్కొంది. ఇప్ప‌టికే  ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో సినిమా టైటిళ్లను నమోదు చేయించారు. ఇటీవ‌లే వార్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన `యూరి- ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్` చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 300కోట్లు వ‌సూలు చేసింది. యూరి ప్రాంతంలో ఉగ్ర‌వాదుల‌పై ఎటాక్స్ నేప‌థ్యంలోని చిత్ర‌మ‌ది. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా భార‌తీయ సినిమాకి చాలానే నేర్పించింది. అంత‌కుమించిన ఉద్వేగం `పుల్వామా దాడి` ఘ‌ట‌న‌లో ఉంది. అంత‌కుమించి వెయ్యి రెట్లు ఎమోష‌న్ వైమానిక దాడుల్లో ఉంది. అందుకే అదంతా పెద్ద తెర‌పైకి తెచ్చేందుకు పోటీప‌డుతున్నారంతా. ఎమోష‌న్ + వార్ + టెన్ష‌న్ =  వేల‌ కోట్లు అంటూ బాలీవుడ్ నిర్మాత‌లంతా తెగ ప‌రుగులు పెట్టేస్తున్నారు!! ఇక ఇన్ని టైటిల్స్ రిజిస్ట‌ర్ చేసారు కాబ‌ట్టి ఇందులో కొన్ని వెబ్ సిరీస్ లు ఉండే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.


Tags:    

Similar News