'ఆచార్య' vs 'అఖండ'.. మెగా vs నందమూరి..!

Update: 2022-04-30 03:30 GMT
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ''ఆచార్య'' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రీకొడుకులు తొలిసారిగా పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ''ఆచార్య'' చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. చిరంజీవి - చరణ్ ల నటన మెప్పించినా.. కథ కథనాల్లో కొత్తదనం లేదని ఆడియన్స్ అంటున్నారు. తనదైన శైలి రచనతో భారీ విజయాలను అందుకున్న కొరటాల.. ఈసారి మెగా హీరోల స్టార్ వాల్యునే నమ్ముకున్నారని కామెంట్స్ వస్తున్నాయి.

అదే సమయంలో 'ఆచార్య' నేపథ్యాన్ని 'అఖండ' సినిమాతో పోల్చుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. రెండు సినిమాలూ హిందూ ధర్మం విశిష్టత - మైనింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కాయని అంటున్నారు. ఈ క్రమంలో మెగా - నందమూరి ఫ్యాన్స్ మధ్య ట్వీట్స్ వార్ నడుస్తోంది.

'అఖండ' సినిమాలో నందమూరి బాలకృష్ణ పోషించిన రెండు పాత్రలు మైనింగ్ మాఫియాను ఎదిరించడమే కాదు.. హిందూ ధర్మాన్ని కాపాడుతాయి. ఇక్కడ 'ఆచార్య' సినిమాలోనూ చిరంజీవి - రామ్ చరణ్ ఆ అంశాల మీదనే పోరాటం చేశారు. అయితే బాలయ్య బ్లాక్ బస్టర్ సాధిస్తే.. ఈ విషయంలో మెగా తండ్రీకొడుకులు నిరాశ పరిచారని అంటున్నారు.

అంతేకాదు బాలయ్య కు బోయపాటి శ్రీను ఎలివేషన్స్ ఓ రేంజ్ లో పెడితే.. 'ఆచార్య' లో చిరంజీవి కి అలాంటి సీన్స్ పడలేదని కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ థమన్ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తే.. ఇక్కడ మణిశర్మ మ్యూజిక్ తో మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయారని అభిప్రాయ పడుతున్నారు.

చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించినప్పటికీ.. 'ఆచార్య' సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రీ రిలీజ్ బజ్ ఏర్పడలేదు. మూవీ మీద హైప్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారు. 'అఖండ' చిత్ర బృందం ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. హైప్ లేకపోయినా సినిమాలో కంటెంట్ సరిగ్గా ఉంటే ప్రేక్షకాదరణ దక్కుతుంది. కానీ 'ఆచార్య' విషయంలో అక్కడ కూడా ఫెయిల్ అయ్యారని అంటున్నారు.

మొత్తం మీద బాలకృష్ణ డ్యూయల్ రోల్ తో 'అఖండ'మైన విజయం సాధిస్తే.. 'ఆచార్య' చిత్రంలో చిరు - చరణ్ కలిసి నటించినా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఒకానొక సందర్భంలో 'అఖండ' - 'ఆచార్య' సినిమాకు ఒకేసారి బరిలో దిగుతాయనే టాక్ నడిచింది. అదే జరిగుంటే నందమూరి - మెగా ఫ్యాన్స్ మధ్య వార్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News