'మా' ఎన్నిక‌ల లోగుట్టు విప్పిన హేమ‌

Update: 2019-04-03 09:07 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల్లో వివాదాల గురించి తెలిసిందే.  ఎన్నిక‌ల ముందు, ఎన్నిక‌ల త‌ర్వాత కొత్త - పాత అధ్య‌క్షుల మ‌ధ్య హోరాహోరీ న‌డిచింది. కొత్త అధ్య‌క్షుడు న‌రేష్ తో గ‌త‌ అధ్య‌క్షుడు శివాజీ రాజా విభేధించారు. న‌రేష్ `నేను` అనే ప‌ద్ధ‌తి మార్చుకోవాలని కొత్త కార్య‌వ‌ర్గంలోనూ ముస‌లం రాజుకోవ‌డం వేడెక్కించింది. న‌రేష్ కి సొంత ప్యానెల్‌ స‌భ్యులే వ్య‌తిరేకులు అని అర్థ‌మైంది. ముఖ్యంగా మా ఎన్నిక‌ల్లో శివాజీ రాజాపై సీనియ‌ర్ న‌రేష్ గెలిచేందుకు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ఎంతో చేసినా ఆ ఇద్ద‌రినీ అత‌డు ప‌క్క‌న పెట్టార‌ని బ‌హిరంగ మీటింగ్ లో గొడ‌వ తేల్చి చెప్పింది. ఈ వివాదాల‌న్నిటిపైనా.. మా ఎన్నిక‌ల తీరుతెన్నుల‌పైనా `మా` ఈసీ మెంబ‌ర్ .. ఇండిపెండెంట్ గా గెలిచిన న‌టి హేమ స్ప‌ష్టంగా వివ‌రాలందించారు.

అధ్య‌క్షుడిగా ఎన్నికైన న‌రేష్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో క‌మిటీలో ఇత‌ర స‌భ్యులంతా విభేధించార‌ని న‌టి హేమ తెలిపారు. అంద‌రినీ క‌లుపుకుపోకుండా న‌రేష్ ఏక‌ప‌క్షంగా ఉండ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. అంతేకాదు.. తాను వీట‌న్నిటినీ వ్య‌తిరేకిస్తోంది కాబ‌ట్టి త‌న‌ను రౌడీ, రెబ‌ల్ అని పిలుస్తున్నార‌ని .. ఎలా పిలిచినా త‌న‌కు స‌మ్మ‌త‌మేన‌ని హేమ అన్నారు. 800 మంది మూవీ ఆర్టిస్టులు బావుండాల‌నే తాను ఓపెన్ గా ఉంటున్నాన‌ని హేమ వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ప్ర‌మాణ స్వీకారాల వేళ త‌న నుంచి అధ్య‌క్షుడు న‌రేష్ మైక్ లాక్కోవ‌డం త‌న‌కు అవ‌మాన‌మేన‌ని అన్నారు. అత‌డి ఏక‌ప‌క్ష విధానాల్ని ప్ర‌శ్నించేందుకే మైక్ తీసుకున్నాన‌ని హేమ అన్నారు.

మా ఎన్నిక‌ల్లో శివాజీ రాజా ఓడిపోవ‌డానికి కార‌ణాల్ని తాజా ఇంట‌ర్వ్యూలో హేమ వెల్ల‌డించారు. `మా` ఎన్నిక‌ల చివ‌రి నిమిషంలో 800 మంది స‌భ్యుల‌కు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ కుమార్తెలు (శివానీ, శివాత్మిక‌) ఇద్ద‌రూ ఫోన్లు చేసి త‌మ ప్యానెల్ కు ఓటేయాల్సిందిగా కోరార‌ని .. దాని ప్ర‌భావం ప‌డింద‌ని తెలిపారు. అలాగే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సైతం న‌రేష్ ప్యానెల్ కి స‌పోర్టుగా నిల‌వ‌డంతో శివాజీ రాజా ఓడిపోక త‌ప్ప‌లేద‌ని అన్నారు. ప్ర‌మాణ స్వీకారం విష‌యంలో శివాజీ రాజా వ్య‌తిరేకించిన‌ప్పుడు న‌రేష్ మీడియా ముందుకు వెళ్లాల్సిన ప‌నేలేద‌ని ఆ విష‌యాన్ని అత‌డు త‌మ‌తో చ‌ర్చించ‌నే లేద‌ని హేమ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం కొత్త‌గా ఎన్నికైన `మా` నూత‌న కార్య‌వ‌ర్గం అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా ఉండ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే ఈ స‌న్నివేశం నుంచి న‌రేష్ ఎలా బ‌య‌ట‌ప‌డి `మా`ను అభివృద్ధి వైపు న‌డిపిస్తారో అన్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News