టికెట్ రేట్ల అంశంపై వాళ్ళు మాట్లాడతారో లేదో చూద్దాం: నాని

Update: 2021-11-29 16:30 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్లలో నాలుగు షోలు.. టికెట్ రేట్ల అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్కువ డబ్బులు రాబట్టుకోవడానికి సినిమాటోగ్రఫీ చట్టానికి విరుద్ధంగా ఒకే రోజు అత్యధిక షోలు వేస్తున్నారని.. అధిక టికెట్ ధరలు వసూలు చేస్తున్నారని.. వీటిని నియంత్రించడానికి, ప్రేక్షకుడిపై టికెట్ ధరల భారం పడకుండా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనిపై టాలీవుడ్ సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రభుత్వ నిర్ణయం వల్ల పెద్ద సినిమాల నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడతారని.. కరోనా నేపథ్యంలో జనాలు థియేటర్లకు రావడమే కష్టంగా మారిన సమయంలో టికెట్ రేట్లు తగ్గిస్తే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టికెట్ రేట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ఇప్పటికే చిరంజీవి - సురేష్ బాబు వంటి సినీ పెద్దలు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో 'తిమ్మరుసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థియేటర్స్ టికెట్ రేట్ల అంశాన్ని లేవనెత్తిన హీరో నాని.. ఇప్పుడు పరోక్షంగా మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

నిత్యామీనన్ - సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'స్కైలాబ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు నాని చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో మాట్లాడుతూ చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా సత్య ని ఉద్దేశిస్తూ ''డోంట్ వర్రీ సత్యా. టిక్కెట్ రేట్స్, థియేటర్ల గురించి నేను ఈరోజు ఫంక్షన్ లో మాట్లాడను. లాస్ట్ టైమ్ న్యూస్ ఆర్టికల్స్ మొత్తం దాని గురించే వచ్చాయి. మేము మాట్లాడాల్సింది అయిపోయింది. మిగతా వాళ్ళు మాట్లాడాలి. మాట్లాడతారో లేదో చూద్దాం'' అని నాని అన్నారు.

నాని చమత్కారంగా మాట్లాడినప్పటికీ.. టికెట్ రేట్ల విషయంలో తాను ఆల్రెడీ మాట్లాడానని.. మిగతా హీరోలు మాట్లాడాల్సి ఉందని కౌంటర్ వేశారని అర్థం అవుతోంది. నిజానికి ఒకరిద్దరు మినహా టికెట్ రేట్ల విషయంపై స్టార్ హీరోలెవరూ నోరు మెదపడం లేదు. నాగార్జున - బాలకృష్ణ వంటి హీరోలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. మరి ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లపై పునరాలోచన చేస్తుందో లేదో చూడాలి.
Tags:    

Similar News