‘బ్యాలెట్ పేపర్లు ఇంటికి తీసుకెళ్లారు’.. ‘మా’ ఎన్నికల అధికారి రియాక్షన్ ఇది!

Update: 2021-10-13 03:32 GMT
‘రీల్’ కథకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగుతున్న రియల్ కథగా మారింది ‘మా’ ఎన్నికల వ్యవహారం. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ వరకు జరిగింది చూశాం. ఇప్పుడు పోలింగ్ తర్వాత.. ఫలితాలు వెల్లడి తర్వాత జరుగుతున్నది చూస్తున్నాం. కీలకమైన పోలింగ్ వేళ అసలేం జరిగిందన్న విషయంపై సంచలన ఆరోపణల్ని సంధించారు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి బరిలోకి నిలిచి.. విజయం సాధించిన వారు.

వారు సంధించిన ఆరోపణల్లో ఒకరు చేసిన ఆరోపణ చాలా పెద్దది. అది.. బ్యాలెట్ పేపర్లను (పోస్టల్ బ్యాలెట్) ఇంటికి తీసుకెళ్లటం. కౌంటింగ్ పూర్తి అయ్యాక.. అందరూ వెళ్లిపోయినా తాను మాత్రం అక్కడే ఉన్నానని.. ఎన్నికల అధికారి తనతో పాటు పోస్టల్ బ్యాలెట్ పత్రాల్ని తీసుకెళ్లారని.. అలా తీసుకెళ్లకూడదు కదా? అని తాను అడిగితే.. ఆ అధికారం తనకు ఉంటుందని చెప్పారంటూ టీవీ నటుడిగా సుపరిచితుడు.. ‘ఈటీవీ’ ప్రభాకర్ గా గుర్తింపు ఉన్న ప్రభాకర్ సంచలన అంశాల్ని వెల్లడించారు.

దీనిపై ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కృష్ణమోహన్ స్పందించారు. సదరు ఆరోపణల్లో నిజం లేదని.. అవన్నీ తప్పుడు ఆరోపణలుగా కొట్టేశారు. ఆదివారం అనసూయ గెలిచారంటూ వచ్చిన వార్తలు అబద్ధమని.. అతానే తాను బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లినట్లుగా  తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను తీసుకెళ్లింది బ్యాలెట్ పేపర్స్ కాదని.. అవి ఉన్న బాక్సులకు వేసిన తాళాల గుత్తి మాత్రమే అంటూ వివరణ ఇచ్చారు. మరి.. ఈ వ్యాఖ్యలపై కీలక ఆరోపణలు చేసిన ప్రభాకర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News