డబ్బుకోసమే కొన్ని సినిమాలు చేశాను: 'ఆనంద్' హీరో

Update: 2020-12-15 07:30 GMT
రాజా .. ఈ పేరు వినగానే 'ఆనంద్' సినిమా గుర్తుకు వస్తుంది. చిన్ని చిన్ని కళ్లతో .. చిరు మందహాసంతో .. విభిన్నమైన డైలాగ్ డెలివరీతో ఆయన ఆ సినిమాలో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఆయన కొన్ని సినిమాలు చేసినా, అవి 'ఆనంద్' సరసన నిలబడలేకపోయాయి. ఆ తరువాత కొన్ని పరిస్థితుల కారణంగా ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆయన నటనకు బై చెప్పేసి, మరో మార్గంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అలాంటి రాజా .. తాజాగా  'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు.

"నేను పుట్టిపెరిగింది వైజాగ్ లో .. నా ఐదేళ్ల వయసులోనే 'కేన్సర్' కారణంగా అమ్మ చనిపోయింది. నా 14వ ఏట నాన్న పోయారు. అప్పటి నుంచి అక్కయ్యలిద్దరే నా బాగోగులు చూసుకున్నారు. ఒక తల్లిపోయినా ఇద్దరు తల్లులను ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఒక వైపున చదువుకుంటూనే, మరో వైపున చిన్నచిన్న ఉద్యోగాలు చేశాను. ముంబై వెళ్లి మోడలింగ్ దిశగా కూడా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే అక్కడికి ఈవీవీ సత్యనారాయణగారు రావడం, నేను ఆయనను కలవడం జరిగింది.

ఈవీవీ సత్యనారాయణగారి పెద్దబ్బాయి 'రాజేశ్' తో నాకు పరిచయం ఉంది. ఆయన సిఫార్స్ చేయడం వల్లనే 'ఓ చినదాన' సినిమాలో సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, నేనంటూ ఒకడిని ఉన్నాననే విషయాన్ని పరిశ్రమ గుర్తించింది. 'విజయం' నా రెండో సినిమా .. రెండో సినిమానే రామానాయుడిగారి బ్యానర్లో చేసే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టంగా భావించాను. ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయిగానీ, థియేటర్స్ లో ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది.

'ఆనంద్' సినిమాతో నాకు బ్రేక్ వచ్చింది. శేఖర్ కమ్ముల గారు నాకు స్క్రిప్ట్ ఇచ్చి, నా అభిప్రాయం చెప్పమన్నారు. ఆ స్క్రిప్ట్ చదువుతుండగానే అనుకున్నాను మంచి సినిమా అవుతుందని. ఆ సినిమా బాగా ఆడటంతో నాకు మంచి పేరు వచ్చింది .. వరుసగా అవకాశాలు వచ్చాయి. నా కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా 'ఆనంద్' అని చెప్పొచ్చు. ఆ తరువాత కొన్ని సినిమాలు ఇష్టపడి చేస్తే, మరికొన్ని సినిమాలు అయిష్టంగానే చేయవలసి వచ్చింది. 'ఎందుకు చేశానురా బాబూ' అని అనుకున్నవి కూడా ఉన్నాయి. అప్పటి నా ఆర్ధిక పరిస్థితుల కారణంగా అలా డబ్బుకోసమే కొన్ని సినిమాలు చేయవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News