మెర్స‌ల్ పై విజ‌య్ కృతజ్ఞత లేఖ‌...వైరల్‌!

Update: 2017-10-25 18:19 GMT
మెర్స‌ల్ సినిమాలోని జీఎస్టీ - దేవాల‌యాల‌పై విజ‌య్ చెప్పిన డైలాగులు వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు హెచ్ రాజా మెర్స‌ల్ కు మ‌తం రంగు పులుముతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య్ ...మ‌తం మార్చుకున్నార‌ని, ఆయ‌న క్రిస్టియ‌న్ కావ‌డం వ‌ల్లే బీజేపీ - మోదీకి వ్య‌తిరేకంగా డైలాగులు చెప్పార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌పై విజ‌య్ తండ్రి చంద్ర‌శేఖ‌ర్ మండిప‌డ్డారు. విజ‌య్ త్వర‌లోనే రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆకాంక్షించారు. ఈ నేప‌థ్యంలో విజ‌య్ తొలిసారి మెర్స‌ల్ వివాదంపై స్పందించారు. మెర్సల్ చిత్రానికి మ‌ద్ద‌తునిచ్చిన ప్ర‌తి ఒక్క‌రికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ ప్ర‌కారం ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. రాజకీయాలకు అతీతంగా సినిమా విజయం సాధించడం తనకు కొండంత‌ బలాన్నిచ్చిందన్నారు. అందరి సహకార‌మే తనను ఇంకా ముందుకు నడిపిస్తుందని విజ‌య్ అన్నారు.  

ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా మెర్స‌ల్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రం మొద‌టి వారంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 170 కోట్లు వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. మెర్స‌ల్ ను బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేసిన అభిమానుల‌కు, త‌న చిత్రానికి మ‌ద్ద‌తుగా నిలిచిన వారికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ విజ‌య్ ఓ బ‌హిరంగ లేఖ రాశారు. ''మెర్స‌ల్ విడుద‌లైన త‌ర్వాత ఆ సినిమాను ర‌క‌ర‌కాల వివాదాలు చుట్టుముట్టాయి. నాకు, ఆ చిత్రానికి మ‌ద్ద‌తుగా నిలిచిన నా అభిమానులు - ఇండ‌స్ట్రీలోని మిత్రులు - నా స‌హ న‌టీన‌టులు - ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ - యాక్ట‌ర్స్ అసోసియేష‌న్‌ - రాజ‌కీయ నాయకులు - వీరంద‌రికీ పేర‌పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మెర్స‌ల్ ను భారీ హిట్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు'' అని విజ‌య్ లేఖ రాశారు. ఆయ‌న విడుద‌ల చేసిన లేఖ‌ను ఓ అభిమాని ట్విట్ట‌ర్లో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.
Tags:    

Similar News