బాల‌య్య‌కి అంజ‌లి వెన్ను పోటు.. అస‌లు క‌థేంటో?

Update: 2022-06-06 03:30 GMT
అచ్చ తెలుగ‌మ్మాయి అంజ‌లి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చ‌ద‌వుకుంటున్న రోజుల్లోనే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. మొద‌ట కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత `ఫొటో` అనే మూవీ చేసి టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అంజ‌లి.. షాపింగ్‌మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు త‌దిత‌ర చిత్రాలతో ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయింది.

అయితే అందం, అభిన‌యం, అంత‌కుమించి ట్యాలెంట్ ఉన్నా తెలుగు అమ్మాయి కావ‌డం వ‌ల్ల అంజ‌లి ఇక్క‌డ స్టార్ హీరోయిన్ గా ఎద‌గ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం అడ‌పా త‌డపా సినిమాలు చేస్తున్న ఈ అందాల భామ‌.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కే వెన్ను పోటు పొడ‌వ‌బోతోంద‌ట‌. అయితే రియ‌ల్ గా కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

`అఖండ‌` వంటి భారీ హిట్ త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేస్తున్నారు. `ఎన్బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్ తో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తైన వెంట‌నే బాల‌య్య స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ మూవీని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు.

`ఎన్బీకే 108` వ‌ర్కింగ్ టైటిల్ తో సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ లో ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. తండ్రీ, కూతురు మధ్య సాగే కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. ఇందులో బాల‌య్య క్యారెక్ట‌రైజేష‌న్ చాలా విభిన్నంగా ఉండబోతోంది. అలాగే ఆయ‌న కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీ‌లీల క‌నిపించ‌బోతోంది. హీరోయిన్ గా ప్రియ‌మ‌ణి ఎంపిక అయిన‌ట్లు వార్త‌లు వస్తున్నాయి.

అయితే ఈ చిత్రంలో అంజ‌లి కూడా న‌టిస్తోంద‌ట‌. సినిమాలో ఓ కీల‌క పాత్ర‌ కోసం మేక‌ర్స్ అంజ‌లిని సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే ఓకే చెప్పింద‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. అంజ‌లి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో క‌నిపించ‌బోతోంద‌ట‌. బాల‌య్య ప‌క్క‌న ఉంటూనే, ఆయ‌న‌కు వెన్ను పోటు పొడిచే విధంగా ఆమె పాత్రను అనిల్ రావిపూడి డిజైన్ చేశాడ‌ని, సినిమాకే ఆమె రోల్ ఒక హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News