ఫాంటసీ ప్రేమకథతో 'అద్భుత' విజయాన్ని అందుకుంటారా..?

Update: 2021-11-18 11:30 GMT
చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జా.. 'ఓ బేబీ' సినిమాలో ఓ కీలక పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'జోంబీ రెడ్డి' చిత్రంతో సోలో హీరోగా మారి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల 'ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ' మూవీతో పలకరించిన తేజ.. వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'హను-మాన్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు తేజ. అయితే దీని కంటే ముందు యువ హీరో 'అద్భుతం' అనే చిత్రాన్ని కంప్లీట్ చేసాడు.

''అద్భుతం'' సినిమా థియేట్రికల్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ అవుతోంది. ప్రముఖ డిజిటల్ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రేపు (నవంబర్19) శుక్రవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టిన మేకర్స్.. ఇటీవల ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఇందులో తేజ సజ్జా సరసన సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది.

వేర్వేరు ప్రదేశాల్లో నివసించే ఇద్దరు యువతీయువకులకు ఒకే ఫోన్ నెంబర్ ని కేటాయించడం వల్ల వారి జీవితాల్లో ఎలాంటి ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయనేది 'అద్భుతం' సినిమాలో ఆద్యంతం ఆకట్టుకునేలా వినోదాత్మకంగా చూపించబోతున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ఫాంటసీ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

'అద్భుతం' చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ‘నరుడా డోనరుడా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన మల్లిక్.. 'పెళ్ళిగోల' ‘తరగతి గది దాటి’ వంటి వెబ్ సిరీస్ లతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు విభిన్నమైన లవ్ స్టోరీతో రూపొందించిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో ప్రేమకథతో పాటు సైన్స్‌ ఫిక్షన్‌ - థ్రిల్లింగ్‌ అంశాలు కూడా మిళితమై ఉంటాయని దర్శకుడు చెబుతున్నారు.

''తేజ ఈ సినిమాలో సూర్య అనే కుర్రాడిగా కనిపిస్తాడు. అతనికి గతంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల చాలా ఒత్తిడికి గురవుతుంటాడు. అతని జీవితంలోకి వెన్నెల అనే చలాకీ అమ్మాయి ప్రవేశించాక.. అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. ట్రైలర్‌ లో చూపించినట్లు ఒకే ఫోన్‌ నంబర్‌ ఇద్దరికి ఎలా ఉందన్నది ఆసక్తికరం. మరి అదెలా సాధ్యమైంది? దాని వెనకున్న కథేంటి? అన్నది ఆకట్టుకునేలా చూపించాం. ఇంటర్వెల్ కు ముందు తేజ - శివానిల మధ్య వచ్చే ఎపిసోడ్‌ హైలైట్‌ గా నిలుస్తుంది. సినిమా చివరి 15 నిమిషాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది'' అని మల్లిక్ రామ్ తెలిపారు.

'అద్భుతం' చిత్రంలో సత్య - తులసి - శివాజీ రాజా - సత్య - హర్ష - మిర్చి కిరణ్ - దేవీ ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రథన్ సంగీతం సమకూర్చారు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే - మాటలు అందించారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ రెడ్డి మొగుల్ల ఈ సినిమాని నిర్మించారు. ఫాంటసీ ప్రేమకథతో రూపొందించిన 'అద్భుతం' సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.
Tags:    

Similar News