ట్యాక్సీవాలా.. కొత్త కామెడీ తోడైంది

Update: 2018-11-27 11:16 GMT
పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఊహించని విజయం సాధించింది ‘ట్యాక్సీవాలా’ సినిమా. విజయ్ దేవరకొండ ‘పెళ్ళిచూపులు’ తర్వాత కమిటైన సినిమా ఇది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. దీనికి విజయ్ తీసుకున్న పారితోషకం తక్కువ. సినిమా బడ్జెట్ కూడా తక్కువే. బయ్యర్లకు కూడా తక్కువ రేట్లకే సినిమాను అమ్మారు. కానీ ‘అర్జున్ రెడ్డి’.. ‘గీత గోవిందం’ సినిమాలతో విజయ్ రేంజ్ ఎంత పెరిగిందో తెలిసిందే. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా రావడంతో ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే పెట్టుబడి మీద రెండు మూడు రెట్లు ఈ సినిమా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వారాంతంలోనూ ఒక కొత్త సినిమా తరహాలో ‘ట్యాక్సీవాలా’ జోరు చూపించింది. ఐతే ఈ వారం ‘2.0’ వస్తుండటంతో ‘ట్యాక్సీవాలా’ జోరుకు తెరపడుతుందని భావిస్తున్నారు.

కానీ చిత్ర బృందం మాత్రం ఆశలు వదులుకోకుండా సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంది. అమెరికాలో లాంగ్ రన్ ఆశిస్తున్న ‘ట్యాక్సీవాలా’ టీం.. తాజాగా అక్కడ ఏడు నిమిషాల కొత్త కంటెంట్ సినిమాకు జోడించింది. ఈ చిత్రంలో హాలీవుడ్ పాత్రలో కొత్త కుర్రాడు విష్ణు చేసిన కామెడీ హైలైట్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. అతడితో పాటు విజయ్ - మధు కాంబినేషన్ లో తీసిన ఒక హిలేరియస్ కామెడీ ఎపిసోడ్‌ ను కొత్తగా సినిమాకు కలుపుతున్నారు. ఇది ఏడు నిమిషాల నిడివితో ఉంటుందట. ఐతే ఈ ఆఫర్ యుఎస్ ప్రేక్షకులకు మాత్రమేనట. నిజానికి ఎడిటింగ్ దశలో ట్యాక్సీవాలా నిడివి మూడున్నర గంటలు. దాన్ని బాగా కుదించి రెండు గంటల 12 నిమిషాల తుది నిడివితో సినిమా వదిలారు. ఇలాంటి హార్రర్ థ్రిల్లర్ లకు క్రిస్ప్ రన్ టైం ఉండాలని భావించి.. మంచి సీన్లను కూడా లేపేశారట. ఐతే సినిమాలో విష్ణు కామెడీకి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ 7 నిమిషాల కామెడీ కంటెంట్ కలుపుతున్నారు.
Tags:    

Similar News