'ఆదిపురుష్' వివాదం: ఇంతకీ ప్రభాస్ కు నోటీసులు పంపిందెవరు..?

Update: 2022-10-10 16:29 GMT
గత కొన్ని రోజులుగా 'ఆదిపురుష్' సినిమా చుట్టూ వివాదాలు విమర్శలు వస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ పౌరాణిక చిత్రం టీజర్ ఇటీవలే విడుదలైంది. వీఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. మరోవైపు ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులు వస్తున్నాయి.

'ఆదిపురుష్' పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ సినిమాని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారని.. దీన్ని విచారించి ప్రభాస్ మరియు మేకర్స్ కు నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే నోటీసులు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు కాదని మరో వార్త వచ్చింది.

ప్రభాస్ మరియు 'ఆదిపురుష్' టీమ్ కు నోటీసు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు కాదని.. అది నేషనల్ సినీ వర్కర్స్ యూనియన్ అని తెలుస్తోంది. హీరో మరియు మేకర్స్ పై చర్యలు తీసుకోడానికి NCWU లీగల్ నోటీసును అందజేసిందని పేర్కొంటున్నారు.

'ఆది పురుష్' హీరో మరియు నిర్మాతలు హిందూ పురాణ ఇతిహాసమైన రామాయణాన్ని ఈ విధంగా చూపించడం ఖండించదగినదని.. మొత్తం చిత్రీకరణ అభ్యంతరకరంగా ఉందని నోటీసు అందజేసిన న్యాయవాది అష్సిహ్ రాయ్ పేర్కొన్నట్లు నివేదికలు వస్తున్నాయి.

'ఆదిపురుష్' బృందానికి నోటీసులు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు కాకపోయినా.. రిపోర్ట్స్ చెబుతున్నట్లు లీగల్ నోటీసులు పంపింది నేషనల్ సినీ వర్కర్స్ యూనియన్ అయినా.. న్యాయస్థానం పరిధిలోకే వస్తుంది. కాబట్టి ఇది సినిమాకు సమస్యగా మారే అంశంగానే పరిగణించాలి. దీనిపై టీమ్ ఇంకా స్పందించలేదు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

కాగా, 'ఆదిపురుష్' అనేది ప్రభాస్ కు ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ సినిమా. తెలుగు - హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందించిన ఈ చిత్రాన్ని పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. టీ సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ చేసిన టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. థియేటర్లలో స్క్రీనింగ్ చేయబడిన 3డీ టీజర్ కు విశేష స్పందన లభించింది. అయితే ఇందులో రాముడు - హనుమంతుడు - రావణుడు పాత్రల చిత్రీకరణపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

''ఆది పురుష్'' చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆలోపు సినిమా చుట్టూ ఉన్న అన్ని వివాదాలు సమిసిపోతాయేమో వేచి చూద్దాం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News