ప్రొడ్యూస‌ర్స్ కి షాకిచ్చిన ఆదిత్యా మ్యూజిక్!

Update: 2022-12-02 07:31 GMT
టాలీవుడ్ లో వున్న ఏకైక లీడింగ్ మ్యూజిక్ కంప‌నీ 'ఆదిత్యా మ్యూజిక్‌' దీనిని గ‌త కొన్ని ద‌శాబ్దాల కాలంగా ఉమేష్ గుప్తా ర‌న్ చేస్తున్నారు. 90వ ద‌శ‌కంలో ఈ సంస్థ‌ని ప్రారంభించారు. అప్ప‌టి నుంచి ప్ర‌ముఖ స్టార్ ల సినిమాల ఆడియోల‌తో పాటు ప్రాధాన్య‌త వున్న సినిమాల ఆడియోల‌ని మార్కెట్ చేస్తూ టాలీవుడ్ లో తిరుగులేని ఆడియో కంప‌నీగా అవ‌త‌రించింది. లీయో త‌రువాత ఆ స్థానాన్ని సొంతం చేసుకున్న సంస్థ‌గా  పేరు తెచ్చుకుంది. ఈ సంస్థ‌కు అటు ఇటుగా రాజు హిర్వాణీ 'సుప్రీమ్‌' మ్యూజిక్ సంస్థ‌ని స్థాపించినా ఆదిత్య మ్యూజిక్ ని మాత్రం బీట్ చేయ‌లేక‌పోయాడు.

ప్ర‌స్తుతం ఆదిత్య మ్యూజిక్ ఇప్ప‌టికీ టాలీవుడ్ లో టాప్ ఆడియో సంస్థ‌గా కొన‌సాగుతోంది. సుప్రీమ్ మాత్రం క‌నుమ‌రుగైపోయింది. తాజాగా గ‌త రెండేళ్లుగా ఆదిత్య మ్యూజిక్ ప్ర‌భావం కూడా తెలుగులో క్ర‌మంగా త‌గ్గుతూ సారేగామ‌, ఆనంద్, టి సిరీస్ టాలీవుడ్ లో త‌మ ప్రాబ‌ల్యాన్ని చాటుకోవ‌డం మొద‌లైంది. పాన్ ఇండియా సినిమాల ప‌రంప‌ర టాలీవుడ్ లో మొద‌లు కావ‌డంతో ప‌లు బాలీవుడ్ ఆడియో కంప‌నీలు టాలీవుడ్ లోకి రంగ ప్ర‌వేశం చేయ‌డం మొద‌లైంది.

దీంతో క్ర‌మ క్ర‌మంగా ఆదిత్య వారి ప్రాబ‌ల్యం త‌గ్గుముఖం ప‌డుతూ వ‌స్తోంది. అయినా స‌రే ఇప్ప‌టికీ ఈ సంస్థ‌లోనూ త‌మ సినిమాల ఆడియోల‌ని రిలీజ్ చేస్తూ వ‌స్తున్నారు చాలా వ‌ర‌కు నిర్మాత‌లు. స్టార్ హీరోల సినిమాల నుంచి ముఖ‌చిత్రం లాంటి సినిమాల వ‌ర‌కు ఆయా సినిమాల ఆడియోల‌ని, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్ ని ఆదిత్య మ్యూజిక్ మార్కెట్ చేస్తూ వ‌స్తోంది. కొన్ని ద‌శాబ్తాల కాలంగా టాలీవుడ్ లో పాతుకు పోయిన సంస్థ కావండం తెలిసిందే.

దీంతో ఈ సంస్థ యూట్యూబ్ ఛాన‌ల్ కు మిలియ‌న్ ల కొద్దీ ఫాలోవ‌ర్స్‌, స‌బ్స్ క్రైబ‌ర్స్ వున్నారు. తాజాగా ఈ సంస్థ కు చెందిన ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛాన‌ల్ హ్యాకింగ్ కు గురైంది. దీంతో యూట్యూబ్ వారు ఈ ఛాన‌ల్ ని యూట్యూబ్ నుంచి తొల‌గించి షాకిచ్చారు. ఎంత మంది నిర్మాత‌ల‌కు చెందిన ఎన్నో వేల పాట‌ల స‌మాహారంగా వున్నాఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛాన‌ల్ హ్యాకింగ్ కు గురై యూట్యూబ్ నుంచి తొల‌గించ‌బ‌డ‌టంతో నిర్మాత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పులు మొద‌లైన‌ట్టుగా తెలుస్తోంది.

మిలియ‌న్ ల కొద్ది స‌బ్స్ క్రైబ‌ర్స్ వున్నఈ ఛాన‌ల్ ద్వారానే చాలా వ‌ర‌కు నిర్మాత‌లు త‌మ సినిమాల ప్ర‌మోష‌న్స్ ని నిర్వ‌హిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ తో వున్న ఒప్పందం కార‌ణంగా చాలా వ‌ర‌కు నిర్మాత‌లు త‌మ సినిమాల లిరిక‌ల్ వీడియోలు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, వీడియో సాంగ్ ల‌ని రిలీజ్ చేస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌డు ఒక్క‌సారిగా ఈ ఛాన‌ల్ హ్యాకింగ్ కు గురై యూట్యూబ్ నుంచి తొలిగించ‌డంతో దీనిపైనే ఆధార‌ప‌డిన చాలా మంది నిర్మాత‌లు షాక్ కు గుర‌వుతున్నార‌ట‌.

అంతే కాకుండా ఇంకొత మంది నిర్మాత‌లు మాత్రం ఛాన‌ల్ టెర్మినేట్ కాడంతో త‌మ‌కు సంబంధించిన చాలా సినిమాల పాట‌లు పోయాయ‌ని విల‌పిస్తున్నార‌ట‌. అంతే కాకుండా ఆదిత్య మ్యూజిక్ ఛాన‌ల్ హ్యాక్ అయిన టెర్మినేట్ కావ‌డంతో పెద్ద సినిమాల పాట ప్ర‌మోష‌న్ కూడా ప్రశ్నార్థ‌కంలో ప‌డిపోయింద‌ని అంటున్నారు. గ‌త రెండు రోజులు అవుతున్నా దీనిపై ఆదిత్య వారు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోబోతున్నార‌న్న‌ది స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News