'ఏజెంట్' డేటు మారినా దర్జా మారదు.. దూకుడు మారదు..!

Update: 2021-12-24 08:38 GMT
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఏజెంట్''. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్పై థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ గూఢచారిగా కనిపించనున్నారు. ఇటీవల 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అక్కినేని వారసుడు.. రెట్టింపు ఉత్సాహంతో ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు.

'ఏజెంట్' సినిమా విడుదల కోసం మేకర్స్ అప్పట్లోనే డిసెంబర్ 24వ తేదీని లాక్ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరిస్థితులన్నీ తారుమారు అవడంతో.. అఖిల్ సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా సినిమా పోస్ట్ పోన్ గురించి వెల్లడించారు.

''అక్కినేని అభిమానులందరికి నమస్కారం. కరోనా వలన మా 'ఏజెంట్' డేటు మారినా దర్జా మారదు.. దూకుడు మారదు.. ధీమా మారదు. అఖిల్ యాక్షన్ మరియు సురేందర్ రెడ్డి స్టైల్ తో 'ఏజెంట్' ప్రపంచ స్థాయి గూఢచారి సినిమాలతో సమానంగా ఉంటుంది. మీరు కలలు కంటున్న ప్రతిదాన్ని మేము 1000% అందజేస్తామని అభిమానులందరికీ మేము హామీ ఇస్తున్నాము'' అని అనిల్ సుంకర ట్వీట్ లో పేర్కొన్నారు.

ఓ అక్కినేని ఫ్యాన్ దీనికి స్పందిస్తూ.. ''క్లాస్ అనే వర్డ్ వద్దు.. మాకు కంప్లీట్ మాస్ కావాలి. 'హలో' టైప్ యాక్షన్ వద్దు.. 'రేసుగుర్రం' వంటి యాక్షన్ సెట్ చేయండి'' అని ట్వీట్ చేసాడు. అనిల్ సుంకర దీనికి రియాక్ట్ అవుతూ.. ''వరల్డ్ క్లాస్ అంటే వరల్డ్ క్లాస్ రేంజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. క్లాస్ మూవీ కాదు బాబోయ్'' అని సమాధానమిచ్చారు. ప్రొడ్యూసర్ ట్వీట్ తో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈసారి అఖిల్ అంటే ఏంటో ఈ సినిమాతో చూపిస్తారని ధీమాగా ఉన్నారు.

ఇప్పటి వరకు లవర్ బాయ్ తరహా పాత్రలు చేసిన అఖిల్.. 'ఏజెంట్' సినిమాలో స్పై పాత్ర కోసం సరికొత్త లుక్ లోకి మారిపోయాడు. జిమ్ లో హార్డ్ వర్కౌట్స్ చేసి కండలు తిరిగిన దేహాన్ని రెడీ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అందరూ ఫిదా అయ్యారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇందులో అక్కినేని వారసుడిని కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు.

'ఏజెంట్' చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు. రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్రఫీ.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరియు సరెండర్‌2సినిమా బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనిల్ సుంకర - సురేందర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News