ఎయిర్ లిఫ్ట్.. బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అంతగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ మూవీ ట్రైలర్. ఈ సినిమా నేపథ్యం ఓ పెద్ద సెన్సేషన్ తో ముడిపడి ఉండటమే దీనికి కారణం. భారత దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతూ.. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక మంది బాధితుల్ని కాపాడి స్వదేశానికి తీసుకొచ్చిన ఆపరేషన్ గా గిన్నిస్ రికార్డులకు ఎక్కిన ఉదంతానికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడం దీని ప్రత్యేకత. దీని గురించి తెలియాలంటే పాతికేళ్లు వెనక్కి వెళ్లాలి.
1990లో నియంత సద్దాం హుస్సేన్ నేతృత్వంలోని ఇరాక్ సైన్యం.. కువైట్ మీదికి దాడికి దిగింది. ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించి.. ధరల పెంపుకు సహకరించాలని తాము చేసిన ప్రతిపాదనకు అంగీకరించలేదన్న కారణంతో ఇరాక్ సైన్యం కువైట్ మీదికి దాడికి దిగి దురాక్రమణకు పాల్పడింది. ఆ సమయంలో కువైట్ రాజ కుటుంబం సౌదీ అరేబియాకు పారిపోయింది. ఇరాక్ సైన్యం మొత్తం కువైట్ ను ఆక్రమించుకుని ఆస్తుల్ని కొల్లగొట్టింది. లక్షల మందిని తమ అధీనంలోకి తీసుకుంది. లక్షా 70 వేల మంది భారతీయ ప్రజలు అందులో చిక్కుకున్నారు. ఇళ్లతో పాటు తమ ఆస్తులన్నింటినీ లూటీ చేయడంతో జనాలు దిక్కూ దివానం లేని స్థితికి చేరుకున్నారు. బాధితుల్లో రంజిత్ కట్యాల్ అనే ఓ భారతీయ వ్యాపారి కూడా చిక్కుకున్నాడు. అతను కువైట్ లో మోస్ట్ పవర్ ఫుల్ మ్యాన్. తన లాంటి బాధితులందరినీ ఒక్కతాటిపై నిలిపి.. భారత సైన్యం సహకారంతో ఆ ఉపద్రవం నుంచి రంజిత్ ఎలా బయటపడేశాడన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది.
ట్రైలర్ చూస్తే ఓ అద్భుతమైన, ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ చూడబోతున్న భావన కలిగిస్తోంది ‘ఎయిర్ లిఫ్ట్’. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏడుగురు బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. 2016 జనవరి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.