రజినీ కూతురు ఆత్మకథ రాసేస్తోంది

Update: 2016-09-04 15:30 GMT
రజినీకాంత్ కూతుళ్లిద్దరూ ఘటికురాళ్లే. పెద్దమ్మాయి ఐశ్వర్య.. చిన్నమ్మాయి సౌందర్య.. బహుముఖ ప్రజ్నాశాలులు. ఇద్దరూ మెగా ఫోన్ పట్టి సినిమాలు కూడా తీశారు. అందులోనూ పెద్దమ్మాయి అయితే చెల్లికన్నా రెండాకులు ఎక్కువే చదివింది. ఆమె దర్శకురాలు మాత్రమే కాదు. రచయిత.. సింగర్.. డ్యాన్సర్ కూడా. అంతే కాదు.. అనేక సేవా కార్యక్రమాలతోనూ మంచి పేరు సంపాదించింది. తాజాగా ఐక్యరాజ్య సమితి మహిళల సుహృద్భావ రాయబారిగానూ ఎంపికై అరుదైన గౌరవాన్ని సంపాదించింది ఐశ్వర్య. ఈ సందర్భంగా తన తండ్రి ఎలా స్పందించారో చెబుతూ.. తన ఆత్మకథ కూడా రాయబోతున్నట్లు చెప్పింది ఐశ్వర్య.

‘‘సూపర్ స్టార్ కూతురిగా.. మరో స్టార్ హీరో భార్యగా.. ఫిల్మ్ మేకర్‌ గా.. ఇద్దరు పిల్లల తల్లిగా ఇప్పటిదాకా నేను ఎదుర్కొన్న అనుభవాలతో ‘స్టాండింగ్ ఆన్ యాన్ యాపిల్ బాక్స్’ పేరుతో ఆత్మకథ రాస్తున్నాను. నా జీవితంలోనూ ఎత్తుపల్లాలు.. ఆగ్రహావేదనలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ పుస్తకం బయటికొస్తుంది. దర్శకురాలిగా నా అరంగేట్రం సాఫీగానే సాగిపోయింది. నా బ్యాగ్రౌండ్ వల్లే నాకు సునాయాసంగా అవకాశం దక్కింది. అది నా అంతట నేనుగా సంపాదించిన అవకాశం కాదు. ఐతే ఐక్యరాజ్య సమితికి ఉమెన్ గుడ్‌ విల్ అంబాసిడర్‌ గా ఎంపికవడం మాత్రం నేను సొంతంగా సాధించుకున్నది. నా వ్యక్తిగతంగా అది సాధించాను కాబట్టి  నాన్న చాలా సంతోషించారు.  ‘ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అన్నారు. నా భర్త ఆనందం గురించి చెప్పనవసరం లేదు. అలాంటి తండ్రి.. అలాంటి భర్త ఉండబట్టే నేనీ స్థాయికి చేరుకోగలిగాను’’ అని ఐశ్వర్య చెప్పింది.
Tags:    

Similar News