తెలుగ‌మ్మాయ్ అంతగా వెయిట్ చేసింద‌ట‌!

Update: 2019-07-03 04:48 GMT
త‌మిళంలో దుమ్ము దులిపేస్తున్న ఓ తెలుగమ్మాయి టాలీవుడ్ లో లాంచ్ అయ్యేందుకు చాలా ఆలోచించింద‌ట‌. దాదాపు 25 సినిమాల్లో న‌టించాక తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడుతోంది. అంటే ఎంత గ్యాప్ తీసుకుందో.. ఎంత‌గా ఆలోచించిందో అర్థం చేసుకోవాలి. తెలుగ‌మ్మాయి కాబ‌ట్టి ఆచితూచి ఎంతో గొప్ప క‌థ దొరికితే కానీ అస‌లు తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్ట‌కూడ‌ద‌ని అనుకుందిట‌. పైగా త‌న తండ్రిగారు న‌టుడు రాజేష్ తెలుగువారికి సుప‌రిచితం. తాత హ‌ర‌నాథ్ కూడా తెలుగు వారే కావ‌డంతో ఎంతో  జాగ్ర‌త్త తీసుకున్నాన‌ని చెబుతోంది. ఇంత‌కీ ఎవ‌రీ తెలుగ‌మ్మాయి? అంటే.. ట్యాలెంటెడ్ ఐశ్వ‌ర్య‌రాజేష్.

కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి అనే రీమేక్ తో తెలుగు ఆడియెన్ ని ప‌ల‌క‌రించేందుకు వ‌స్తోంది ఐశ్వ‌ర్య‌. ఈ సినిమాతో పాటు ఐశ్వ‌ర్య రాజేష్ న‌టించిన `మిస్ మ్యాచ్` అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక నిన్న‌టి సాయంత్రం కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి ప్రీరిలీజ్ వేడుక‌లో ఐశ్వ‌ర్యారాజేశ్ మాట్లాడుతూ - ``తమిళంలో నేను చేసిన నాయికా ప్ర‌ధాన చిత్రం క‌ణ‌. ఆ సినిమా రీమేక్ తో ఇక్క‌డ‌ ప‌రిచ‌యం అవుతున్నా. నాన్న‌- తాత‌య్య‌- అత్త‌య్య (శ్రీ‌ల‌క్ష్మి) తెలుగు సినిమాలు చేశారు క‌దా! మీరెందుకు తెలుగు సినిమాలు చేయ‌డం లేదని అడిగిన‌ప్పుడు మంచి క‌థ ఉన్న సినిమాతో తెలుగులో ప‌రిచ‌యమ‌వుతాన‌ని చెప్పేదాన్ని. 25 సినిమాలు త‌ర్వాత క‌ణ చేసిన‌ట్టే తెలుగులో తొలి సినిమానే కౌస‌ల్య కృష్ణ‌మూర్తిగా వ‌చ్చింది`` అని అన్నారు. ఇలాంటి లాంచ్ అంద‌రికీ దొరుకుతుందా? అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు. రీమేక్ ఓకే అయ్యాక‌ మూడు వారాల్లో షూటింగ్ ప్రారంభించి క‌ళ్లు మూసి తెరిచే లోపే మెగా ప్రొడ్యూస‌ర్ కె.ఎస్.రామారావు గారు రిలీజ్ చేసేస్తున్నారు. ఒరిజినాలిటీ చెడ‌కుండా భీమ‌నేని తెర‌కెక్కించారు. త‌మిళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగులోనూ అంతే పెద్ద హిట్ అవుతుంద‌ని అనుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్‌గారు నా తండ్రి పాత్ర‌లో.. ఝాన్సీ పాత్ర‌లో నా త‌ల్లి పాత్ర‌లో న‌టించార‌ని తెలిపారు.

ఐశ్వ‌ర్య రాజేష్ - ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేం) జంట‌గా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థ నిర్మించిన  `మిస్ మ్యాచ్` చిత్రానికి ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాలో ఐశ్వ‌ర్య‌ ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాల‌తో తెలుగ‌మ్మాయ్ ఐశ్వ‌ర్య‌ ప‌రిచ‌యం అవుతుండ‌డం ఆస‌క్తిక‌రం.


Tags:    

Similar News