అజయ్ దేవగణ్ దమ్మున్న స్టేట్మెంట్

Update: 2016-10-08 15:30 GMT
సరిహద్దుల్లో దాడులు చేసింది ఉగ్రవాదులా.. పాకిస్థాన్ నటులా.. అంటూ చాలా తెలివిగా ప్రశ్నించాడు సల్మాన్ ఖాన్. ఆయన లాజిక్ బాగానే ఉంది. పాకిస్థాన్ నటీనటుల్ని బ్యాన్ చేయడం అన్నది సమంజసమే అని చెప్పలేం. కానీ మన సూపర్ స్టార్ హీరో గారు పాకిస్థాన్లో జరిగిందాని గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. అక్కడ మన సినిమాల్నే పూర్తిగా బ్యాన్ చేశారు. థియేటర్లలో ప్రస్తుతం ఆడుతున్న ఇండియన్ సినిమాల్ని లేపేశారు. ఇకముందూ మన సినిమాల్ని ఆడనివ్వమని తేల్చి చెప్పారు. దీని గురించి మాత్రం సల్మాన్ సార్ నోరు విప్పలేదు. అది తప్పు అని ఖండించలేదు. ఆయన మాత్రమే కాదు.. ఖాన్ త్రయంలో మిగతా ఇద్దరు కూడా మాట్లాడలేదు. పాకిస్థాన్ నటుల్ని బ్యాన్ చేయడం తప్పు అని గొంతు చించుకుంటున్న వేరే సెలబ్రెటీలు కూడా ఈ విషయంలో మాత్రం సైలెంటుగానే ఉన్నారు.

ఇలాంటి టైంలో అజయ్ దేవగణ్ దమ్మున్న స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఆర్టిస్టుల్ని బ్యాన్ చేయడం సమంజసమే అన్నాడు. ఇరు దేశాల మధ్య కాల్పులు జరుగుతున్నంత వరకూ సాంస్కృతిక సంబంధాలు ఉండరాదని.. దీన్ని తాను సమర్థిస్తానని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్లో తన సినిమాలు విడుదల కాకున్నా పట్టించుకోనని.. కళాకారులు దేశానికి మద్దతుగా ఉండాలని అజయ్ స్పష్టం చేశాడు. అజయ్ భార్య కాజోల్ సైతం ఈ విషయంలో భర్తకు మద్దతుగా నిలిచింది. తన భర్త సరైన ప్రకటనే చేశారని ఆమె అన్నారు. రాజకీయాలకు అతీతంగా అజయ్ తీసుకున్న వైఖరిని సమర్థిస్తున్నానని.. ఇందుకు గర్విస్తున్నానని ఆమె ట్వీట్ చేసింది. ఈ నెలలోనే అజయ్ కొత్త సినిమా ‘శివాయ్’ రాబోతున్నా సరే.. గొడవలు సద్దుమణిగితే దాన్ని పాకిస్తాన్లో కూడా భారీగా రిలీజ్ చేసుకునే అవకాశమున్నా అజయ్ రాజీ పడకుండా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. అజయ్ లాగా ఇలా ఓ స్టాండ్ తీసుకునే వాళ్లు అరుదుగా కనిపిస్తారు. అతడి వైఖరిపై ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు.. కానీ హిపోక్రసీకి తావివ్వకుండా ధైర్యంగా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినందుకు మాత్రం అజయ్ దేవగణ్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News