#RRRలో దేవ‌గ‌న్ రోల్ ఇదేనా?

Update: 2020-01-21 08:09 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ నిరంత‌రం అభిమానుల్లో హాట్ టాపిక్. 2020 మోస్ట్ అవైటెడ్ మూవీగా జూలై 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల వ‌రుస‌ క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎట్టి ప‌రిస్థితిలో డెడ్ లైన్ ప్ర‌కారం సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయ‌డ‌మే ధ్యేయంగా రాజ‌మౌళి ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

ఇక ఈ సినిమాని పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ చేస్తున్నారు కాబ‌ట్టి తెలుగు-త‌మిళ వెర్ష‌న్ల‌తో పాటు హిందీ వెర్ష‌న్ ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేయ‌నున్నారు. ప్ర‌త్యేకించి పాన్ ఇండియా అప్పీల్ కోసం ఉత్త‌రాది ఆడియెన్ ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ని ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌ కోసం సెలెక్ట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా దేవ‌గ‌న్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఈ మంగ‌ళ‌వారం నుంచి ఎలాంటి బ్రేక్ అన్న‌దే లేకుండా అజ‌య్ దేవ‌గ‌న్ పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నారు. అయితే ఈ చిత్రంలో దేవ‌గ‌న్ పోషించే పాత్ర ఏది? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఆర్.ఆర్.ఆర్ ఒక హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ స్టోరి. స్వాతంత్య్ర ఉద్య‌మంలో విశాఖ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు(చ‌ర‌ణ్‌).. నైజాం గిరిజ‌న వీరుడు కొమురం భీమ్ (తార‌క్) సాహ‌సాల్ని తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు. ఆ రెండు పాత్ర‌ల్లోకి ఫిక్ష‌న్ ని జొప్పించి క్రియేట్ చేసిన క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామ‌ని రాజ‌మౌళి ఆరంభ‌మే ప్ర‌క‌టించారు. అయితే ఈ సినిమాలో దేవ‌గ‌న్ ఎలాంటి పాత్ర‌ను పోషిస్తారు? అంటే.. ఆయ‌న ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగానే ఓ విప్ల‌వవీరుడిగా న‌టిస్తార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స‌హా ఉత్త‌రాదిన దేవ‌గ‌న్ కి హిస్టారిక‌ల్ స్టార్ గా ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. 2002లో దేవ‌గ‌న్ న‌టించిన `ది లెజెండ్ ఆఫ్ భ‌గ‌త్ సింగ్` అత‌డికి గొప్ప పేరును తెచ్చింది. ఆవేశ‌ప‌రుడైన విప్ల‌వ వీరుడు భ‌గ‌త్ సింగ్ పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌తో మెప్పించిన దేవ‌గ‌న్ .. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లో అదే త‌ర‌హా పాత్ర‌ లో న‌టిస్తున్నార‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటం అనే కామ‌న్ క‌నెక్ష‌న్ వ‌ల్ల‌నే ఈ సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. భ‌గ‌త్ సింగ్ పాత్ర‌ లో అత‌డు జాతీయ ఉత్త‌మ న‌టుడి గా కీర్తిని ఆర్జించారు. అందుకే ఆ త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తార‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఆ త‌ర‌హా పాత్ర అయితే ఉత్త‌రాది ఆడియెన్ కి క‌నెక్ట‌వ్వ‌డం ఈజీ అని అంచ‌నా వేస్తున్నారు. అయితే దేవ‌గ‌న్ ఎలాంటి రోల్ పోషిస్తున్నారు? అన్న‌దానికి జ‌క్క‌న్న టీమ్ నుంచి అధికారిక వివ‌ర‌ణ రావాల్సి ఉంది. స్వాతంత్య్ర సంగ్రామం లో అల్లూరి- కొమురం భీమ్ తో భ‌గ‌త్ సింగ్ క‌నెక్ష‌న్ ని ఎలా లింక‌ప్ చేశారు ఈ ఫిక్ష‌న్ డ్రామా లో అన్న‌ది కీల‌క‌మైన ఎలిమెంట్. 1922 నుంచి 1947 మ‌ధ్య ర‌క‌ర‌కాల ఎలిమెంట్స్ ని ఎలా చూపిస్తున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఇక ఈ చిత్రంలో అలీస‌న్ డూడీ- రే స్టీవెన్ స‌న్ ప్ర‌తినాయ‌క పాత్ర‌లు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News