ఆర్ ఆర్ ఆర్ కథలో కీలక మలుపు ఇదేనట?

Update: 2020-04-20 07:30 GMT
అల్లురి సీతారామరాజు.. ఉత్తరాంధ్ర మన్యం వీరుడు. అక్కడ గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ వారితో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఇక కొమురం భీం.. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో గిరిజనుల కోసం తుపాకీ పట్టి నిజాం ప్రభువులను ఎదురించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన గిరిజన యోధుడు.

 చరిత్రలో ఈ ఇద్దరు రెండు ప్రాంతాల విముక్తి కోసం పోరాడారు.. రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేశారు. ఇద్దరు కలిసింది లేదు.. కలిసి పోరాడింది లేదు. కానీ ఒకే కాలంలో ఈ ఇద్దరు వారి వారి ప్రజల కోసం పాటుపడ్డారు.

కానీ రాజమౌళి ఈ ఇద్దరి కథను తీసుకొని సినిమాటిక్ స్టైల్లో స్నేహితులుగా చూపించబోతున్నాడా?  వారిద్దరూ తమ సొంత ప్రాంతాన్ని వదిలి రెండు మూడేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు.. అక్కడ ఏం చేశారన్నది ఎవరికీ తెలియదు.. ఇప్పుడు ఇదే కథను తీసుకొని రాజమౌళి సృజనాత్మకంగా కల్పనగా అల్లి చూపించబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు.

చరిత్రలో అస్సలు కలవని ఇద్దరు యోధులు అల్లూరి - భీంలు కలిస్తే ఎలా ఉంటుంది? వారిద్దరూ అజ్ఞాతవాసంలో కలిసి పోయి సొంత ప్రాంతాలకు వచ్చి విప్లవవీరులుగా ఎదిగిన వైనాన్ని రాజమౌళి కల్పిత కథగా ‘ఆర్ ఆర్ ఆర్’లో వండివార్చబోతున్నాడు. మంచి స్టోరీ టెల్లర్ అయిన రాజమౌళి సృజనాత్మకతకు ఎలాగూ ప్రేక్షకులను అలరించడం ఖాయం.

అయితే తాజాగా ఆర్ ఆర్ ఆర్ కథకు సంబంధించిన కీలక మలుపు ఇదేనంటూ టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యుక్త వయసులోకి వచ్చిన అల్లూరి - కొమురం భీంలు వారి ప్రాంతాల్లో దొరల అన్యాయాలను సహించలేక.. ఏమీ చేయలేక ఇంటి నుంచి పారిపోయి ఉత్తర భారతానికి వెళ్లిపోతారు. అజ్ఞాతంలో బతుకుతారు. ఆ సమయంలోనే వీరిద్దరూ బాలీవుడ్ అగ్రహీరో ‘అజయ్ దేవగణ్’ను కలుస్తారట.. వీరిలో కసిని శక్తిగా మార్చే గురువుగా అజయ్ దేవ్ గణ్ ‘ఆర్ ఆర్ ఆర్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడట.. వీరిద్దరూ అసమాన యుద్ధ విద్యలు నేర్పి వారిని పోరాటానికి పంపించే గురువుగా అజయ్ దేవ్ గణ్ కనిపిస్తారట..

ఆర్ ఆర్ ఆర్ కథను మలుపుతిప్పేలా అజయ్ దేవ్ గణ్ పాత్ర ఉంటుందని సమాచారం. మరి భీం - అల్లూరి లాంటి యోధులకే గురువు లాంటి పాత్ర అంటే అంతటి పెద్ద హీరో కావాలి కదా.. అందుకే అజయ్ దేవ్ గణ్ ను తీసుకొచ్చి చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారట.. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టేలా ఈ కీలక ట్విస్ట్ సినిమాలో అలరిస్తుందని టాక్. మరి ఈ రూమర్ నిజమో కాదో తెలియదు కానీ.. ఇప్పటికైతే ‘ఆర్ ఆర్ ఆర్’ను మలుపు తిప్పే సన్నివేశం ఇదేనంటున్నారు. మరి వెండితెర పైనే అసలు కథ ఏంటో చూడాలి. అప్పటి వరకు మనకు ఈ వెయింట్ తప్పదు.

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని వచ్చే జనవరి 8 సంక్రాంతి కానుకగా రాజమౌళి విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కరోనా కారణంగా వాయిదా పడే చాన్స్ ఉంది. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మాత డీవీవీ దానయ్య తీస్తున్న ఈ మూవీలో చరణ్ - ఎన్టీఆర్ - అజయ్ దేవ్ గణ్ - ఆలియా భట్ - ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Tags:    

Similar News