సంక్రాంతి పోటీలో స్టార్‌ హీరో 'బలం' చూపిస్టాడట!

Update: 2021-12-26 07:34 GMT
మరో రెండు వారాల్లో సంక్రాంతి సీజన్ ప్రారంభం కాబోతుంది. టాలీవుడ్‌ లో సంక్రాంతి సీజన్‌ కు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. సంక్రాంతి ని జక్కన్న ఆర్ ఆర్‌ ఆర్ సినిమా తో ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాడు. రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఆ సినిమా కోసం ఇప్పటికే మహేష్‌ బాబు తన సర్కారు వారి పాట ను తప్పించగా.. పవన్‌ కళ్యాన్ కూడా తన భీమ్లా నాయక్ ను సంక్రాంతి బరి నుండి తప్పించడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతికి ఆర్ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్‌ సినిమా లు ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు బంగార్రాజు కూడా విడుదల అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు సినిమాలతో పాటు తమిళ స్టార్‌ హీరో అజిత్‌ సంక్రాంతికి తన బలం చూపించేందుకు సిద్దం అవుతున్నాడు. తెలుగు లో ఈయనకు ఒకప్పుడు మంచి ఇమేజ్.. క్రేజ్ ఉండేది. ఆయన తమిళ సినిమాలు తెలుగు లో బాగా ఆడాయి. కాని ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన సినిమాలు తెలుగు నాట పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. అయినా కూడా సంక్రాంతికి తన సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

సంక్రాంతికి అజిత్ మోస్ట్ వెయిటెడ్‌ మూవీ వాలిమై విడుదల కాబోతుంది. హిట్‌ కాంబోలో రూపొందిన ఈ సినిమా భారీ బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని తమిళ ఆడియన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అక్కడ సినిమా రికార్డు స్థాయి బిజినెస్ ను చేస్తుంది. వాలిమై ను తెలుగు లో విడుదల చేస్తారా లేదా అనే అనుమానాలు ఉన్న సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు బలం అనే టైటిల్‌ తో తెలుగు లో సినిమా ను డబ్‌ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడంతో పాటు పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. సంక్రాంతికి అక్కడ ఇక్కడ ఒకే సారి జనవరి 13న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. రికార్డు స్థాయి వసూళ్లు ఈ సినిమా తమిళనాట దక్కించుకోవడం ఖాయం. కాని ఇక్కడ ఉన్న పోటీకి కనీసం ఓపెనింగ్ అయినా దక్కించుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మెట్రో నగరాల్లో అజిత్ కు కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంటుంది. కాని వేరే ఏరియాల్లో మాత్రం బలం సినిమాను గురించి జనాలు ఆలోచిస్తారా అనే అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్ ఆర్‌ ఆర్ మరియు రాధేశ్యామ్‌ వంటి భారీ సినిమాలు ఉండగా.. బంగార్రాజు వంటి ఫ్యామిలీ ఓరియంటెడ్‌ సినిమా ఉండగా సంక్రాంతికి డబ్బింగ్‌ సినిమాకు పోవాలి అనే ఆలోచన ఎవరికి వస్తుంది అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతికి కాకుండా కాస్త అటు ఇటుగా అంటే పోటీ లేని సమయంలో తెలుగు లో విడుదల చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని తమిళ వర్షన్ విడుదల అయిన సమయంలోనే తెలుగు కూడా విడుదల అవ్వాల్సి ఉంది. కనుక ఆ భారీ బుల్డోజర్‌ వంటి సినిమాలతో తెలుగు బాక్సాఫీస్ వద్ద ఆటో రిక్షా వంటి బలం సినిమా ఢి కొట్టాల్సిందే. అప్పుడు ఫలితం ఏంటీ అనేది ప్రతి ఒక్కరు ఊహించగలరు అంటూ నెటిజన్స్ థియరీ చెబుతున్నారు. మరి అజిత్‌ 'బలం' ను టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద చూపిస్తాడా అనేది చూడాలి.
Tags:    

Similar News