రీల్‌ అయిన రియల్‌ అయినా నో పాలిటిక్స్‌

Update: 2019-05-30 07:01 GMT
తమిళ స్టార్‌ హీరో అజిత్‌ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు చాలా కోరుకుంటున్నారు. జయలలిత బతికి ఉన్న సమయంలో ఆమె వారసుడు అజిత్‌ అంటూ ప్రచారం జరిగింది. జయలలితకు సన్నిహితంగా మెలిగిన అజిత్‌ రాజకీయాలపై ఆసక్తి చూపించలేదు. పలు పార్టీల నాయకులు అజిత్‌ ను తమ వైపుకు మరల్చుకునే ప్రయత్నాలు చేశారు కాని ఏ ఒక్కరు కూడా సఫలం కాలేక పోయారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఒక బీజేపీ నాయకుడు అజిత్‌ను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. అసలు అజిత్‌ కు రియల్‌ లైఫ్‌ రాజకీయాలు కాదు.. కనీసం రీల్‌ లైఫ్‌ రాజకీయాలు కూడా ఇష్టం లేదట.

గతంలో ఎప్పుడు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు చేయని అజిత్‌ వద్దకు తాజాగా హెచ్‌ వినోద్‌ ఒక పొలిటికల్‌ డ్రామా స్క్రిప్ట్‌ ను తీసుకు వచ్చాడట. అజిత్‌ 60 చిత్రంగా ఆ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కాని అజిత్‌ మాత్రం రాజకీయ నేపథ్యంలో సినిమా వద్దంటే వద్దనేసి మరో స్క్రిప్ట్‌ కు ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. రాజకీయ నాయకుడిగా నటించేందుకు ఆసక్తి చూపించని అజిత్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రకు ఓకే చెప్పాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పోలీస్‌ వ్యవస్థలో ఉన్న అవినీతికి సంబంధించి.. పోలీసులను లంచాలు ఇచ్చి నేరాలు చేస్తున్న నేరగాళ్ల గురించిన నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుందట. అజిత్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపించి చాలా ఏళ్లు అవుతుంది. అందుకే అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అజిత్‌ 60వ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అజిత్‌ బాలీవుడ్‌ 'పింక్‌' మూవీ రీమేక్‌ నేర్కొండ పార్వై చిత్రం విడుదలకు ప్రమోషన్‌ లో పాల్గొంటున్నాడు.
Tags:    

Similar News