తెలుగు టైటిల్ పెట్టలేని దౌర్భాగ్యమా?

Update: 2022-06-26 07:30 GMT
ఒక భాష‌లో తెర‌కెక్కిన సినిమాను ఇంకో భాష‌లో అనువాదం చేస్తున్న‌పుడు క‌నీసం ఆ భాష‌లో ఒక టైటిల్ పెట్ట‌డం క‌ష్టం అయిపోతోంది ఆయా చిత్ర బృందాల‌కు. ఇది చాలా సింపుల్ విష‌య‌మే అయినా.. ఆ మాత్రం కూడా శ్ర‌ద్ధ పెట్ట‌క‌పోవ‌డం విడ్డూరం. కొన్ని నెల‌ల కింద‌ట అజిత్ న‌టించిన‌ త‌మిళ సినిమా వ‌లిమైను అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేయ‌డం పెద్ద షాక్. వ‌లిమై అంటే శ‌క్తి అని అర్థం.

తెలుగులో అదే టైటిల్ పెట్ట‌లేక‌పోయినా.. ప‌వ‌ర్ అని పెట్టొచ్చు. కానీ త‌మిళ టైటిలే తెలుగుకి కూడా పెట్టారు. ఇది ఒక‌రకంగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అవ‌మానించ‌డ‌మే. ఓటీటీల్లో అయితే ఈ ఒర‌వ‌డి ఇంకా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. మిన్న‌ల్ ముర‌ళి అనే మ‌ల‌యాళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువ‌దించి పెట్టారు. మిన్న‌ల్ అంటే మెరుపు అని అర్థం. మ‌రి మెరుపు ముర‌ళి అని పెట్ట‌డానికి నెట్ ఫ్లిక్స్ వాళ్ల‌కు ఏం ఇబ్బంది వ‌చ్చిందో?

ఇప్పుడు సుడ‌ల్ అనే త‌మిళ వెబ్ సిరీస్‌ను కూడా అదే పేరుతో తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. బ‌య‌ట అదే పేరుతో పోస్ట‌ర్లేసి ఈ ఈ సిరీస్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సిరీస్కు తెలుగులో కూడా మంచి స్పందనే వస్తున్నప్పటికీ అసలు టైటిల్ అర్థం ఏంటో తెలియక తలపట్టుకుంటున్నారు.

ఇక తాజాగా మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కడువాను కూడా అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. అదే పేరుతో టీజర్ కూడా అయిపోయింది. కడువా అంటే మలయాళంలో పులి అని అర్థం. అలాంటప్పుడు నేరుగా పులి అనే టైటిల్ పెట్టుకోవచ్చు. ఆ టైటిల్ తో ఆల్రెడీ సినిమా ఉందనుకుంటే ముందు వెనుక ఇంకో పదం జోడించవచ్చు.

కానీ ఆ ప్రయత్నమే చేయకుండా మలయాళ టైటిలే తెలుగులో కూడా కొనసాగించడం అంటే మన ప్రేక్షకులను ఏం గౌరవిస్తూ ఉన్నట్టు? కనీసం సినిమాను ఇక్కడ ప్రమోట్ చేస్తున్న పి ఆర్ వో లు, డబ్బింగ్ కార్యక్రమాల్లో భాగంగా అవుతున్న వాళ్ళు అయినా టైటిల్ విషయంలో అభ్యంతరాలు, సూచనలు చేయకపోవడం ఆశ్చర్యకరం.
Tags:    

Similar News