అక్డి ప‌క్డి ప్రోమో : మాస్ స్టెప్పుల‌తో విజ‌య్ దుమ్ము దులిపేశాడు

Update: 2022-07-08 11:27 GMT
క్రేజీ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ 'లైగ‌ర్‌'. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేశాడు. బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మూవీ ద్వారా తెలుగు తెర‌కు హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుండ‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్నారు. దాదాపు రెండేళ్లుగా ఈ మూవీ కోసం శ్ర‌మించ‌డ‌మే కాకుండా విజ‌య్‌ భారీ అంచ‌నాలు పెట్టుకున్న మూవీ ఇది.

ఈ సినిమాతో త‌న పాన్ ఇండియా భ‌విత‌వ్యాన్ని తేల్చుకోబోతున్నారు. చార్మీ, పూరితో క‌లిసి బాలీవుడ్ మేక‌ర్స్ క‌ర‌ణ్ జోహార్‌, హీరూ జోహార్‌, అపూర్వ మోహ‌తా ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ పై పూరి క‌నెక్ట్స్ తో క‌లిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఆగస్టు 25న అత్యంత భారీ స్థాయిలో తెలుగు, హిందీ, త‌మిళ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు హిందీలోనూ ద్విభాష చిత్రంగా ఈ మూవీని ఏక కాలంలో నిర్మించారు.  

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్ రాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మైక్ టైస‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో ఈ ప్రాజెక్ట్ అంత‌ర్జాతీయ ట్రేడ్ వ‌ర్గాల దృష్టిప‌డింది.

ముంబై స్ల‌మ్ ఏరియాలో వుండే ఛాయ్ బండీవాలా బాక్సింగ్ లో వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ గా ఎలా అవ‌తరించాడ‌నే క‌థాంశంతో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

సినిమా రిలీజ్ మ‌రో నెల రోజుల‌కు మించి వుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని మొద‌లు పెట్టింది. శుక్ర‌వారం పెప్పి నంబ‌ర్ గా ఫ‌స్ట్ సింగిల్ గా 'అక్డి ప‌క్డి..' అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్ ప్రోమోని విడుద‌ల చేసింది. లిజో జార్జ్  డీజే చేతాస్ ఈ పెప్పీ నంబ‌ర్ కు సంగీతం అందించాడు. భాస్క‌ర భ‌ట్ల సాహిత్యం అందించిన ఈ పాట‌ని అనురాగ్ కుల‌క‌ర్ణి, ర‌మ్య బెహెరా అల‌పించారు. ఈ పాట‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మాసీవ్ స్టెప్పుల‌తో విజిల్స్ తో అద‌ర‌గొట్టేశాడు.

ఫ్లోర్ స్టెప్పుల‌తో హంగ‌మా చేశాడు. ఫ‌స్ట్ టైమ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ రేంజ్ మాస్ బీట్ కి అద‌రిపోయే స్టెప్పులేశాడు. అత‌నితో పోటీప‌డుతూ అన‌న్య పాండే గ్లామ‌ర్ షో చేస్తూ త‌నదైన గ్రేస్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. పాట సాంతం విజిల్స్ వేస్తూ సాగేలా వుంది. థియేట‌ర్లో ఈ పాట‌కు మాస్ ఆడియ‌న్స్ రెచ్చిపోయి విజిల్స్ తో థియేట‌ర్ల‌లో రిసౌండ్ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఫుల్ మాస్ సాంగ్ గా రాబోతున్న ఈ పాట ఫుల్ లిరిక‌ల్ వీడియోని జూలై 11న సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్నారు.

Full View

Tags:    

Similar News