'అఖండ' సీక్వెల్ అక్కడి నుంచే మొదలవుతుందట!

Update: 2022-01-13 08:33 GMT
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన 'అఖండ' అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బలమైన కథాకథనాలు .. ప్రధానమైన పాత్రలను తీర్చిదిద్దిన తీరు .. తమన్ స్వరపరిచిన పాటలు .. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్  మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య పోషించిన అఘోర పాత్ర హైలైట్ గా నిలిచింది. బాలకృష్ణ తన కెరియర్లో ఇంతవరకూ వేస్తూ వచ్చిన గెటప్పులలో అత్యధిక మార్కులను ఈ గెటప్ దక్కించుకుంది.

సాఫ్ట్ గా కనిపించే పాత్రలో బాలయ్య ఎంత హ్యాండ్సమ్ గా కనిపించారో, అఘోర పాత్రలో ఆయన అంత గంభీరంగా అనిపించారు. సన్నివేశాల తీవ్రత .. డైలాగ్స్ లోని పవర్ ప్రేక్షకులను కదలనీయకుండా చేశాయి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా అనేది పట్టుమని వారం రోజులు కూడా థియేటర్లలో నిలబడటం లేదు. అలాంటిది 'అఖండ' 50 రోజుల దిశగా పరుగులు తీస్తుండటం విశేషం. సంక్రాంతికి ఒక్క 'బంగార్రాజు' తప్ప చెప్పుకోదగిన సినిమాలేవీ బరిలో లేవు. 'పుష్ప' ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం వలన, థియేటర్లలో దూకుడు తగ్గింది.

అందువలన ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో మళ్లీ 'అఖండ' వసూళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేకర్స్ ఆ దిశగా ప్రమోషన్స్ చేస్తున్నారు కూడా. నిన్న జరిగిన సక్సెస్ మీట్లో బోయపాటి మాట్లాడుతూ ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని మరోసారి చెప్పాడు. ముందుగా సీక్వెల్ చేయాలనే ఆలోచన లేనప్పటికీ, ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ను చూసిన తరువాత, జరిగిన కథలో నుంచి బలమైన ఒక పాయింటును పట్టుకుని అక్కడి నుంచి సీక్వెల్ కి తగిన కథను అల్లుకుంటూపోయే ఆలోచనలో చేస్తున్నారు.

ఇప్పుడు ప్రేక్షకులంతా కూడా సీక్వెల్ కథ ఎక్కడి నుంచి మొదలుకావొచ్చుననే విషయంపై ఆసక్తికరమైన చర్చలు చేస్తున్నారు. 'అఖండ'లో తన కవల సోదరుడి కూతురికి బాలయ్య ఒక మాట ఇస్తాడు. ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా తనని తలచుకోమనీ .. ఆ వెంటనే తాను ఆమె ముందు ఉంటానని చెబుతాడు. ఈ పాయింట్ నుంచే సీక్వెల్ కథను తీయవచ్చని చెప్పుకుంటున్నారు. కవల సోదరుడి కూతురు పెద్దవడం .. ఆమె ఆపదలో పడటం .. ప్రమాదం మరో వైపు నుంచి రావడం .. ప్రతినాయకుడి స్థానంలో మరొకరు ప్రత్యక్షం కావడం .. ఇలా సీక్వెల్ కూడా ఇంట్రస్టింగ్ గా సాగడానికి తగిన కథ ఉందని అనుకుంటున్నారు. ఇప్పుడు బాలయ్య .. బోయపాటి ముందు కమిట్ అయిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సినిమాలు పూర్తయిన తరువాత, ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నెల 21వ తేదీ నుంచి 'అఖండ' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.        
Tags:    

Similar News